Telangana | స్పెషల్ టాస్క్ బ్యూరో, న్యూఢిల్లీ, జనవరి 26: విద్యార్థులకు తగిన సంఖ్యలో కళాశాలలు అందుబాటులో ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ప్రతి పదిలక్షల జనాభాకు 52 కాలేజీలతో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. 66 కాలేజీలతో కర్ణాటక తొలి స్థానంలో ఉన్నది. ఇక జిల్లాల పరంగా చూస్తే హైదరాబాద్ 491 కాలేజీలతో దేశంలోనే మూడో స్థానంలో, రంగారెడ్డి(349) ఆరో స్థానంలో నిలిచాయి. ఈ మేరకు కేంద్ర విద్యా శాఖ గురువారం విడుదల చేసిన ఆలిండియా సర్వే ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్-ఏఐఎస్హెచ్ఈ(2021-22)నివేదిక వెల్లడించింది. రాష్ర్టాల వారీగా దేశంలోనే దాదాపు 24 కోట్లతో అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్లో అధిక సంఖ్యలో 8,375 కాలేజీలు ఉన్నాయని, యూపీ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, కర్ణాటక ఉన్నాయని తెలిపింది.
యూపీలో ఎక్కువ కాలేజీలు ఉన్నప్పటికీ ఆ రాష్ట్ర జనాభాను బట్టి చూస్తే, ప్రతి పది లక్షల మందికి కేవలం 30 కళాశాలలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో ప్రతి పది లక్షల మందికి కేవలం 29 కాలేజీలే అందుబాటులో ఉన్నాయి. ఇదే సమయంలో 4 కోట్లు మాత్రమే జనాభా ఉన్న తెలంగాణలో 2,083 కాలేజీలు ఉన్నాయి. అంటే ప్రతీ పది లక్షల మందికి 52 కాలేజీలు అందుబాటులో ఉన్నట్టు లెక్క. ఇక, టాప్-10 రాష్ర్టాల్లో ప్రతి 10 లక్షల మంది జనాభాకు కనీసంగా 30 లేదా అంతకంటే ఎక్కువ కాలేజీలు ఉన్నట్టు నివేదిక తెలిపింది. కాగా ఏఐఎస్హెచ్ఈ కింద 328 యూనివర్సిటీలకు చెందిన 45,473 కాలేజీలు రిజిస్టరై ఉన్నాయి.