న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: రాష్ట్ర ఇంధన సామర్థ్య సూచీ (స్టేట్ ఎనర్జీ ఎఫీషియెన్సీ ఇండెక్స్) 2021- 22లో తెలంగాణ ముందంజలో నిలిచింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, రాజస్థాన్ ఫ్రంట్ రన్నర్లుగా నిలిచాయి. ఈ రాష్ర్టాలు 60కి పైగా పాయింట్లు సాధించాయి. 50 నుంచి 60 మధ్య పాయింట్ల సాధించిన అస్సాం, హర్యానా, మహారాష్ట్ర, పంజాబ్ అచీవర్ క్యాటగిరీలో నిలిచాయి. గత సూచికతో పోలిస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గణనీయంగా మెరుగయ్యాయి. కేంద్ర విద్యుత్తు శాఖ ఆధ్వర్యంలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ (బీఈఈ), అలియెన్స్ ఫర్ ఎనర్జీ ఎఫీషియెంట్ ఎకానమీ (ఏఈఈఈ) సంయుక్తంగా ఈ సూచీని రూపొందించాయి. జాతీయ ప్రాధాన్యాల ఆధారంగా ఇంధన సామర్థ్య విధానాల అమలుకు సంబంధించిన 50 అంశాల్లో అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వార్షిక పురోగతిని విశ్లేషించి ఈ సూచీని తయారు చేశాయి. ఢిల్లీలో జరిగిన రివ్యూ, ప్లానింగ్, మానిటరింగ్ సమావేశంలో కేంద్ర విద్యుత్తు, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్ సోమవారం ఈ నివేదికను విడుదల చేశారు.