‘రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నది. దీని కారణంగా నాతో పాటు క్యాబినెట్ మంత్రులందరూ రెండు నెలలపాటు వేతనాలు, టీఏ, డీఏ తీసుకోకూడదని నిర్ణయం తీసుకొన్నాం. ఎమ్మెల్యేలను కూడా ఇదేవిధంగా చేయాలని కోరుతున్నా’.. హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు గురువారం చేసిన ప్రకటన ఇది. కాంగ్రెస్ పాలనలోని హిమాచల్‌లో ఆర్థిక సంక్షోభ పరిస్థితులకు సీఎం ప్రకటనే నిదర్శనం. ఒక్క హిమాచల్‌లోనే కాదు, కాంగ్రెస్ పాలనలో ఉన్న తెలంగాణ, కర్ణాటకలోనూ ఇదే తరహా పరిస్థితులు నెలకొన్నాయి.
Congress | సిమ్లా/న్యూఢిల్లీ, ఆగస్టు 30: కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో పాలనా వైఫల్యం కారణంగా ఆయా రాష్ర్టాల ఆర్థిక వ్యవస్థలు సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. అధికారంలోకి వచ్చేందుకు అడ్డగోలు హామీలు ఇచ్చిన ఆ పార్టీ.. ఇప్పుడు ఆ వాగ్దానాలను అమలు చేయలేక చేతులెత్తేస్తున్న పరిస్థితులు తెలంగాణ, కర్ణాటక సహా హిమాచల్‌ప్రదేశ్‌లలో కనిపిస్తున్నాయి. ఎడాపెడా అప్పులు చేస్తూ.. ప్రజలపై పలు రకాల చార్జీలు, పన్నుల భారం మోపుతున్నాయి. తాజాగా హిమాచల్‌ప్రదేశ్‌లో కనీసం వేతనాలు చెల్లించలేని పరిస్థితుల్లో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టు సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు గురువారం చేసిన ప్రకటన ద్వారా వెల్లడైంది. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నదని సాక్షాత్తూ ఆయనే ఒప్పుకొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తనతో పాటు మంత్రులు రెండు నెలల పాటు వేతనాలు, టీఏ, డీఏ వంటివి తీసుకోకూడదని క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నామని తెలిపారు. రాబోవు రోజుల్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మంచి మెరుగుదల చూసే వరకు శాసనసభ్యులు కూడా ఇదే విధంగా చేయాలని అభ్యర్థించారు.
కనీసం వేతనాలు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో హిమాచల్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి విమర్శించారు. సీఎం తనతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ఎమ్మెల్యేలకు వేతనాలు ఇచ్చుకోలేనంతగా రాష్ట్రంలో పరిస్థితులు దిగజారాయని అన్నారు. రాహుల్ గాంధీ ‘ఖటా-ఖట్’ మాడల్ కారణంగానే రాష్ట్రంలో ఆర్థిక భయానక పరిస్థితులు నెలకొన్నాయని, ఆయన విఫల ఆర్థిక ఆలోచనా విధానాలు బహిర్గతమయ్యాయని విమర్శించారు. కర్ణాటకలో కూడా ఇదే విధమైన పరిస్థితులు నెలకొన్నాయని, పాల నుంచి నీళ్ల వరకు అన్ని నిత్యావసరాల ధరలు పెరిగాయని అన్నారు. ఫేక్ వాగ్దానాలు చేసిన రాహుల్ గాంధీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ఐదు గ్యారెంటీలను నమ్మి ఓటేసిన ప్రజలకు సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ చుక్కలు చూపిస్తున్నది. ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో నెరవేర్చలేదు. గ్యారెంటీలకు అడ్డగోలుగా కోతలు పెడుతున్నది. దీనికితోడుగా పెట్రోల్, డీజిల్‌పై సేల్స్ ట్యాక్స్‌ను 4 శాతం పెంచడంతో పాటు పలు రకాల పన్నులు, చార్జీలతో ప్రజలపై భారం వేస్తున్నది. ‘ఉచిత విద్యుత్తు’ అంటూ ఊదరగొట్టి ఛార్జీల పెంపునకు తెరతీశారని, మహిళలకు ఆర్థిక భరోసా ఇస్తామన్న ‘గృహలక్ష్మి’ స్కీమ్‌కు కొత్త ఆంక్షలు జోడించారని, ఆడబిడ్డలకు ఉచిత బస్సు సర్వీసులంటూ ఊరించిన ‘శక్తి’ స్కీమ్‌లో వయసు, వృత్తి అంటూ కొత్త పరిమితులు తెచ్చారని, నిరుద్యోగులకు భృతి కల్పిస్తామన్న ‘యువనిధి’, పేదలకు ఉచిత బియ్యమన్న ‘అన్నభాగ్య’ ఇలా ప్రతీ స్కీమ్‌లోనూ కోతలు విధిస్తున్నారని ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.
ఇక తెలంగాణలో అయితే గ్యారెంటీల అమలులో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని హస్తం పార్టీ ప్రభుత్వ వైఫల్యాన్ని అటుంచితే.. రాష్ర్టాన్ని అప్పుల్లో ముంచేస్తున్నది. రేవంత్ సర్కార్ కేవలం 8 నెలల్లోనే రూ.50 వేల కోట్లకు పైగా అప్పులు చేసింది. ఒక్క కొత్త ప్రాజెక్టూ లేక, మరోవైపు ప్రజా సంక్షేమమూ లేక తెచ్చిన వేలాది కోట్ల అప్పులు ఎటు పోతున్నాయో తెలియని సందిగ్ధ పరిస్థితులు నెలకొన్నాయి. రుణమాఫీ అంటూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెగ ఊదరగొట్టిన కాంగ్రెస్.. రుణమాఫీని సక్రమంగా అమలు చేయలేక రైతన్నల ఆగ్రహాన్ని చవిచూస్తున్నది. మరోవైపు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం యువత రోడ్లెక్కుతున్న పరిస్థితులు నెలకొన్నాయి.