RJD Leader : పశ్చిమ బెంగాల్లో బీజేపీ అరాచకం సృష్టిస్తోందని బిహార్లో విపక్ష ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆరోపించారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటనపై తేజస్వి గురువారం స్పందించారు. మార్కెట్లలో దుకాణాలను కాషాయ శ్రేణులు లూటీ చేస్తున్నాయని ఆరోపించారు. శాంతియుత వాతావరణాన్ని భగ్నం చేయాలని బీజేపీ కోరుకుంటున్నదని మండిపడ్డారు. వారు ప్రజలను నిరంరం రెచ్చగొడుతూ అలజడులకు ప్రేరేపిస్తున్నారని దుయ్యబట్టారు.
కాషాయ పాలకుల ఉచ్చులో బెంగాల్ ప్రజలు చిక్కుకోరని తాము భావిస్తున్నానమని అన్నారు. ఇక లైంగిక దాడుల విషయానికి వస్తే యూపీ సహా బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే అధికంగా వెలుగుచూస్తున్నాయని చెప్పారు. బిహార్లోనూ లైంగిక దాడుల ఘటనలు తరచూ చోటుచేసుకుంటాయని తెలిపారు. వీటిపై వారు ఎందుకు మౌనంగా ఉంటున్నారని తేజస్వి యాదవ్ నిలదీశారు. బీజేపీ ప్రతిచోటా భయానక వాతావరణం సృష్టించాలని కోరుకున్నా అలా చేయడంలో ఆ పార్టీ ఎప్పుడూ ఫలప్రదం కాలేదని అన్నారు.
కాగా, కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో ట్రైనీ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ బీజేపీ ఇచ్చిన బెంగాల్ బంద్ హింసాత్మకంగా మారింది. మరోవైపు కోల్కతా దుర్ఘటన అత్యంత దురదృష్టకరమని, ఇది తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
Read More :
Mahabubnagar | పాలమూరులో హైడ్రా తరహా కూల్చివేతలు..