Loksabha Elections 2024 : లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ను బీజేపీ చేరుకోలేకపోవడంతో తదుపరి ప్రభుత్వంపై పలు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. విపక్ష ఇండియా కూటమి బిహార్ సీఎం నితీష్ కుమార్‌తో పాటు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడుతో సంప్రదింపులు జరుపుతుందనే ప్రచారం సాగుతోంది.
విపక్ష ఇండియా కూటమి భేటీలో పాల్గొనేందుకు బుధవారం ఢిల్లీ చేరుకున్న ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తదుపరి ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఏం జరుగుతుందో వేచిచూడాలని ఆయన పేర్కొన్నారు. తేజస్వి యాదవ్, ఎన్డీయే భేటీలో పాల్గొనేందుకు ఢిల్లీ బయలుదేరిన బిహార్ సీఎం నితీష్ కుమార్‌లు ఒకే విమానంలో ప్రయాణించడం ఆసక్తికరంగా మారింది.
వీరిద్దరి మధ్య ఎలాంటి చర్చలు జరిగాయన్నది ఉత్కంఠ రేపుతోంది. ఇక ఈ విషయమై తేజస్వి యాదవ్‌ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా వేచిచూడండని బదులిచ్చారు. మరోవైపు ఢిల్లీ చేరుకున్న నితీష్ కుమార్ ప్రభుత్వం ఏర్పాటవుతుందని విలేకరులతో మాట్లాడుతూ పేర్కొన్నారు.
ఇక ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మూడోసారి కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ పావులు కదుపుతోంది. జూన్ 8న ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేస్తారని ఎన్డీయే వర్గాలు తెలిపాయి.
Read More :
Kalki 2898 AD | రెబల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ప్రభాస్ ‘కల్కి’ ట్రైలర్ డేట్ ఫిక్స్