పాట్నా, జూలై 9: కేంద్రంలోని మోదీ సర్కార్‌పై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మరోసారి విమర్శలు గుప్పించారు. బీజేపీ హయాంలో దేశంలో నిరుద్యోగం పెచ్చరిల్లిపోతున్నదని శనివారం మండిపడ్డారు. కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన బీజేపీ.. నెలకు 1.3 కోట్ల మంది ఉపాధిని లాగేసుకుంటున్నదని పేర్కొన్నారు.
‘2020లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు 19 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే హామీ ఇచ్చింది. 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. 2022 నాటికి దేశంలోని 80 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తామని ప్రధాని మోదీ మాటలు చెప్పారు. కానీ, ఉద్యోగాలు కల్పించకుండా.. ఈ పనికిమాలిన ప్రభుత్వం నెలకు 1.3 కోట్ల మంది ఉపాధిని లాగేసుకుంటున్నది’ అని ట్వీట్ చేశారు.