శ్రీనగర్: పెళ్లి వేడుక కోసం వెళ్లిన ముగ్గురు వ్యక్తులు అదృశ్యమయ్యారు. మూడు రోజుల తర్వాత వారి మృతదేహాలను పోలీసులు, ఆర్మీ జవాన్లు గుర్తించారు. (Three Found Dead After Missing) అయితే ఉగ్రవాద ప్రభావిత ప్రాంతం కావడంతో ఉగ్రవాదులు వారిని కిడ్నాప్ చేసి చంపి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మర్హూన్ ప్రాంతంలో నివసించే 15 ఏళ్ల వరుణ్ సింగ్, 32 ఏళ్ల యోగేష్ సింగ్, 40 ఏళ్ల దర్శన్ సింగ్ కలిసి పెళ్లి వేడుక కోసం వెళ్లారు. మార్చి 5న సాయంత్రం వీరు అదృశ్యమయ్యారు. దీంతో వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా, ఉగ్రవాద ప్రభావిత ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు అదృశ్యం కావడంతో ఉగ్రవాదులు వారిని కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆర్మీతోపాటు పోలీసులు రంగంలోకి దిగారు. డ్రోన్ల సహాయంతో ఆ ప్రాంతంలో విస్తృతంగా వెతికారు. శనివారం లోహై మల్హార్ ప్రాంతంలోని చెరువులో వారి మృతదేహాలను గుర్తించారు. పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు ఒక ఉగ్రవాద సంస్థ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాద ప్రభావిత కొండ, అటవీ ప్రాంతంలో అదృశ్యమైన ఆ ముగ్గురు వ్యక్తులు ప్రమాదవశాత్తు మరణించారా? లేక ఉగ్రవాదులు వారిని కిడ్నాప్ చేసి చంపారా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే వారి మృతికి కారణం ఏమిటన్నది పోస్ట్‌మార్టం తర్వాత నిర్ధారణ అవుతుందని పోలీస్ అధికారి వెల్లడించారు.