శంభూ, డిసెంబర్ 14 : పంజాబ్, హర్యానా రాష్ర్టాల సరిహద్దుల్లోని శంభూ పాయింట్ వద్ద హర్యానా భద్రతా సిబ్బంది శనివారం రైతుల పాదయాత్రపై బాష్పవాయు గోళాలు ప్రయోగించాలి. దీంతో కొందరు రైతులు గాయపడ్డారు. ఈ కారణంగా ఢిల్లీకి చేపట్టిన పాదయాత్రను తాత్కాలికంగా నిలిపివేయాలని రెండు రైతు వేదికలు నిర్ణయించినట్లు పంజాబ్ రైతు నాయకుడు స్వరణ్ సింగ్ పంధేర్ విలేకరులకు తెలిపారు. హర్యానా పోలీసుల దూకుడు వల్ల 17-18 మంది రైతులు గాయపడ్డారని ఆయన చెప్పారు. రైతులపై భద్రతా సిబ్బంది రబ్బర్ బుల్లెట్లు పేల్చారని రైతు నాయకుడు మంజిత్ సింగ్ రాయ్ ఆరోపించారు.
రబ్బర్ బుల్లెట్లు తగిలి ఒక రైతు గాయపడినట్లు ఆయన చెప్పారు. రైతులను చెదరగొట్టేందుకు రసాయనాలు కలిపిన నీళ్లను ఉపయోగించారని, ఈ రోజు మరిన్ని బాష్ప వాయు గోళాలను ప్రయోగించారని పంధేర్ తెలిపారు. అయితే ఈ ఆరోపణలను అంబాలా కంటోన్మెంట్ డీఎస్పీ రజత్ గులియా తోసిపుచ్చారు. 101 మంది రైతుల పాదయాత్ర దేశ శాంతి భద్రతలకు ఏ విధంగా ముప్పు అవుతుందని పంధేర్ ప్రశ్నించారు. దేశ రాజధాని వైపు రైతులు పాదయాత్ర చేపట్టడం ఇది మూడవసారి.
పంజాబ్ వెలుపల డిసెంబర్ 16న ట్రాక్టర్ మార్చ్, డిసెంబర్ 18న పంజాబ్ లోపల రైల్ రోకో నిర్వహిస్తామని రైతు నాయకుడు స్వరణ్ సింగ్ పంధేర్ ప్రకటించారు. శనివారం పాదయాత్రలో గాయపడిన రైతులకు చికిత్స అందచేయడంలో అధికారులు నిర్ల క్ష్యం చూపుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రస్తుత శీతాకాల పార్లమెంటరీ సమావేశాలలో రైతుల సమస్యలను సమర్థవంతంగా ప్రస్తావించడంలో, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ రాహుల్ గాంధీ విఫలమయ్యారని ఆరోపించారు.