న్యూఢిల్లీ, జూన్ 7: కేంద్రంలో కొలువుదీరనున్న బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో చేపట్టబోయే మంత్రుల పదవులపై కూటమి పార్టీలతో మంతనాలు ఆరంభమయ్యాయి. ఆదివారం జరిగే మోదీ ప్రమాణ స్వీకారంతో పాటు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. 15 మంత్రి పదవులను కూటమి పార్టీలకు కేటాయించాలని బీజేపీ యోచిస్తున్నది. దీనిలో భాగంగా ఆ పార్టీ సీనియర్ లీడర్లు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాలు సంకీర్ణ పార్టీల నేతలతో శుక్రవారం సాయంత్రం విస్తృతంగా చర్చలు జరిపారు.
ముఖ్యమైన హోం, విదేశీ వ్యవహారాలు, రక్షణ, ఆర్థిక శాఖలతో పాటు రైల్వే, రోడ్డు రవాణా, న్యాయ, ఐటీ, విద్యాశాఖలను కూడా తమ వద్దే అట్టిపెట్టుకోవాలని బీజేపీ భావిస్తున్నది. కూటమిలో బీజేపీ తర్వాత 16 మంది ఎంపీలతో రెండో స్థానంలో ఉన్న టీడీపీకి మూడు మంత్రి పదవులు ఇవ్వనున్నట్టు సమాచారం. వీటిలో ఒకటి కేబినెట్, రెండు సహాయ మంత్రుల ఉండొచ్చని తెలిసింది. జనసేన పార్టీకి కేబినెట్ హోదా, లేదా స్వతంత్ర హోదా ఉన్న సహాయ మంత్రి, 12 సీట్లు గెల్చుకున్న నితీశ్‌కు చెందిన జేడీ(యూ)కు మూడు (ఒకటి కేబినెట్, రెండు సహాయ) మంత్రి పదవులు ఇవ్వనున్నట్టు సమాచారం.