ముంబై: దేశంలోని ప్రముఖ టెక్ కంపెనీల్లో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఉద్యోగులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. తమ మొత్తం వర్క్ ఫోర్స్ నుంచి 12 వేల మందిని తొలగించబోతున్నట్టు ఈ ఏడాది ఆగస్టులో టీసీఎస్ ప్రకటించింది. అయితే, ఈ సంఖ్య చెప్పిన దానకంటే ఎక్కువగానే ఉంటుందని తెలుస్తున్నది. టీసీఎస్‌లో 15 ఏండ్లగా పనిచేస్తున్న ఓ ఉద్యోగి స్నేహితుడు ఒకరు చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనమైంది.
80 వేలమందిని రిజైన్ చేయాలని సంస్థ కోరినట్టు సోహమ్ అనే ఆ ఎక్స్ యూజర్ రాసుకొచ్చాడు. ఇది కాస్తా వైరల్ కావడంతో ఉద్యోగుల గుండెల్లో గుబులు మొదలైంది. ఇది చూసిన చాలామంది ఉద్యోగులు ఆ సంఖ్య నిజమే అయి ఉంటుందని అనుమానం వ్యక్తంచేస్తున్నారు. టీసీఎస్‌లో పనిచేస్తున్న తన స్నేహితుడి భార్య కూడా ఇదే సంఖ్య చెప్పిందని జాషన్ అనే మరో యూజర్ చెప్పుకొచ్చాడు.
ఆ వార్తలు అవాస్తవం: టీసీఎస్ తమ సంస్థ 80 వేల ఉద్యోగాలను తొలగించిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను టీసీఎస్ అధికార ప్రతినిధి ఖండించారు. ఈ సమాచారం అవాస్తవమని స్పష్టం చేశారు.