న్యూఢిల్లీ, జూన్ 4: తత్కాల్ టికెట్ల బుకింగ్ వ్యవస్థ పెద్ద కుంభకోణంగా మారిందని ఐఆర్సీటీసీపై ప్రయాణికుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెబ్సైట్లో మూడు నిమిషాల్లోనే బుకింగ్ అయిపోతున్నాయని చెప్తున్నారు. ఏజెంట్లు అక్రమ మార్గాల్లో ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా వెబ్సైట్ను హైజాక్ చేసి, గంపగుత్తగా టికెట్లు బుక్ చేస్తున్నారని, వాటిని బ్లాక్లో అమ్ముతున్నారని పేర్కొంటున్నారు. ఐఆర్సీటీసీలో టికెట్లు బుక్ కాకపోవడంతో మధ్యవర్తుల నుంచి టికెట్లు కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతున్నదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఐఆర్సీటీసీలోని అవినీతి అధికారుల హస్తం ఉందని వివిధ సామాజిక మాధ్యమ వేదికలపై పోస్టుల ద్వారా ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా తమ అనుభవాలను పేర్కొంటున్నారు.
ఉదయం 10 గంటలకు తత్కాల్ టికెట్ బుకింగ్ ఓపెన్ అవుతున్నదని, అప్పుడు సీట్లు ఖాళీగా ఉన్నట్టు చూపిస్తుందని, వెంటనే మూడు నిమిషాలపాటు సైట్ హ్యాంగ్ అవుతున్నదని చెప్తున్నారు. ఆ తర్వాత 10:03 నిమిషాలకు టికెట్లు మొత్తం బుక్ అయిపోయినట్టు చూపిస్తుందని, అప్పుడు ఏమీ జరగనట్టే సైట్ యథావిధిగా పని చేస్తున్నదని వివరిస్తున్నారు. ఐఆర్సీటీసీ వెబ్సైట్ డిజైన్ కూడా చాలా దారుణంగా ఉందని, హైస్పీడ్ వైఫై ఉపయోగిస్తున్నా సింగిల్ టికెట్ బుక్ చేయడం యూపీఎస్సీ పరీక్ష రాసినంత కష్టంగా ఉందని కొందరు వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు. తీవ్ర విమర్శల నేపథ్యంలో 2.5 కోట్ల అనుమానాస్పద బోగస్ యూజర్ ఐడీలను ఐఆర్సీటీసీ తొలగించినట్టు తెలుస్తున్నది. ఇదంతా పెద్ద కుంభకోణమని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని ప్రయాణికులు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం, రైల్వేశాఖ స్పందించకపోవడం అనుమానాలకు బలం చేకూర్చుతున్నదని మండిపడుతున్నారు.