Jammu Kashmir Elections : కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా పాకిస్తాన్ భాష మాట్లాడుతున్నారని, పాక్ కనుసన్నల్లో నడుస్తున్నారని బీజేపీ ప్రధాన కార్యదర్శి, పార్టీ జమ్ము కశ్మీర్ ఇన్చార్జ్ తరుణ్ ఛుగ్ ఆరోపించారు. పాకిస్తాన్ రక్షణ మంత్రి ప్రకటన ఈ విషయం విస్పష్టంగా వెల్లడిస్తున్నదని అన్నారు. పాకిస్తాన్ ట్యూన్స్‌కు వీరు డ్యాన్స్ చేస్తున్నారని మండిపడ్డారు.
పాకిస్తాన్ తోలుబొమ్మల్లా నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. కాగా, ఆర్టికల్ 370పై కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ వైఖరిని పాకిస్తాన్ రక్షణ మంత్రి సమర్ధించడం పట్ల ఫరూక్ అబ్ధుల్లా స్పందించారు. పాకిస్తాన్ ఏం చెప్పిందనేది తనకు తెలియదని వ్యాఖ్యానించారు. జమ్ము కశ్మీర్‌లోని ఉధంపూర్‌లో ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తాను పాకిస్తానీ కాదని, భారత పౌరుడినని అన్నారు.
జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి ప్రస్తావించగా అక్టోబర్ 8 వరకూ వేచిచూడాలని, అప్పుడు అన్ని విషయాలు స్పష్టమవుతాయని పేర్కొన్నారు. మరోవైపు పాక్ రక్షణ మంత్రి ప్రకటనపై బీజేపీ ప్రతినిధి షెహజాద్ పూనావాలా అభ్యంతరం వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌తో కాంగ్రెస్ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్‌కు ఉన్న సంబంధాన్ని ఏమని పిలుస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, విపక్ష ఇండియా కూటమి నిత్యం పాకిస్తాన్‌తో చేతులు కలిపేందుకు ఎలా ప్రయత్నిస్తున్నాయో మనం చూస్తున్నామని వ్యాఖ్యానించారు.
Read More :
Nursing Student | నర్సింగ్ విద్యార్థిని శ్రుతిది ఆత్మహత్యే.. తేల్చిన పోలీసులు