చెన్నై: ఫ్యాక్టరీల చట్టం సవరణ బిల్లు(Factories Act Amendment Bill)ను వెనక్కి తీసుకుంటున్నట్లు తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రకటించారు. ఎంపిక చేసిన ఫ్యాక్టరీలల్లో పనివేళలను పెంచుతూ తీసుకువచ్చిన చట్ట సవరణను ఉపసంహరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇవాళ కార్మికుల దినోత్సవం సందర్భంగా ఆయన చింతాద్రిపేటలో ఉన్న మే డే పార్క్ స్మారకం వద్ద పుష్పగుచ్చం ఉంచారు. ఆ తర్వాత మాట్లాడుతూ బిల్లు ఉపసంహరణ గురించి ఎమ్మెల్యేలందరికీ చెప్పనున్నట్లు ఆయన తెలిపారు.
కార్మిక సంఘాలు, ప్రతిపక్ష పార్టీల నుంచి ఫ్యాక్టరీ సవరణ బిల్లుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. డీఎంకేకు చెందిన కార్మిక సంఘాలు కూడా ఆ సవరణ బిల్లును వ్యతిరేకించాయి. కొత్త చట్టం కార్మికులకు వ్యతిరేకంగా ఉందని ప్రతిపక్షాలు ఆరోపించారు. ఫ్యాక్టరీల సవరణ బిల్లు ప్రకారం.. ఒకవేళ కార్మికులు 12 గంటలు పనిచేస్తే, అప్పుడు ఆ కార్మికుడు వారానికి 4 రోజులు మాత్రమే పనిచేసే హక్కు ఉంటుంది. అయితే ఈ కొత్త నిబంధన పట్ల విమర్శలు వచ్చాయి. దీంతో స్టాలిన్ సర్కార్ వెనక్కి తగ్గింది.