Armstrong | చెన్నై, జూలై 5: తమిళనాడు బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు కే ఆర్మ్‌స్ట్రాంగ్‌ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా నరికి చంపారు. శుక్రవారం సెంబియమ్ ప్రాంతంలోని తన ఇంటి సమీపంలో పార్టీ నేతలతో మాట్లాడుతున్న ఆర్మ్‌స్ట్రాంగ్‌ను బైక్‌పై వచ్చిన ఆరుగురు వ్యక్తులు దాడి చేసి నరికారు.
తీవ్రంగా గాయపడిన అతడిని దవాఖానకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు ప్రకటించారు. కాగా, గత ఏడాది జరిగిన గ్యాంగ్‌స్టర్ ఆర్కట్ సురేష్ హత్యకు ప్రతీకారంగానే ఇది జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యను బీఎస్పీ అధినేత్రి మాయావతి తీవ్రంగా ఖండించారు.
అమృత్‌పాల్, ఇంజినీర్ రషీద్ ఎంపీలుగా ప్రమాణం
న్యూఢిల్లీ: జైలు నుంచి పోటీ చేసి లోక్ సభ ఎన్నికల్లో గెలిచిన ఖలిస్థాన్ వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్, ఉగ్రనిధుల కేసు నిందితుడు ఇంజినీర్ రషీద్ శుక్రవారం ఎంపీలుగా ప్రమాణం చేశారు. పార్లమెంటు లోపల, బయట కట్టుదిట్టమైన భద్రత నడుమ సభాపతి చాంబర్లో ఈ కార్యక్రమం జరిగింది. అమృత్‌పాల్ పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ నుంచి, రషీద్ జమ్ముకశ్మీరులోని బారాముల్లా నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి గెలిచారు. రషీద్‌పై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ప్రకారం కేసు విచారణలో ఉంది. ఆయన తీహార్ జైలులో ఉన్నారు. అమృత్‌పాల్‌పై జాతీయ భద్రతా చట్టం ప్రకారం కేసు నమోదైంది. ఆయన అస్సాంలోని దిబ్రూగఢ్ జైలులో ఉన్నారు. ప్రమాణ స్వీకారం కోసం వీరిద్దరికీ పెరోల్ మంజూరైంది.