చెన్నై, జూన్ 13: తమిళనాడులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అసాధారణ చర్యకు దిగింది. ఏకంగా రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయంలో మంగళవారం సోదాలు నిర్వహించింది. ఇప్పటికే, విపక్ష పార్టీల నేతలపై ఈడీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో విపక్ష పాలిత రాష్ట్రంలో ఏకంగా సచివాలయంలోనే సోదాలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు విద్యుత్తు, ఎక్సైజ్ శాఖ మంత్రి వీ సెంథిల్ బాలాజీతో పాటు మరింత కొందరి ఇండ్లు, కార్యాలయాల్లో మంగళవారం ఈడీ సోదాలు జరిగాయి. మనీ లాండరింగ్ కేసులో చెన్నై సహా రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు నగరాల్లో ఈడీ దాడులు చేపట్టింది. ఈరోడ్‌లోని తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లారీ కాంట్రాక్టర్ ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చారని మంత్రి సెంథిల్ బాలాజీపై ఈడీ ఆరోపిస్తున్నది. గత నెల బాలాజీ సన్నిహితుల ఇండ్లల్లో ఐటీ అధికారులు కూడా సోదాలు నిర్వహించారు.
సచివాలయంలో ఈడీ సోదాలు చేపట్టడాన్ని తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్రంగా తప్పుపట్టారు. ఇది సమాఖ్య వ్యవస్థకు మచ్చ అని పేర్కొన్నారు. ఈడీకి పూర్తిగా సహకరిస్తానని మంత్రి బాలాజీ చెప్పినప్పటికీ సచివాలయంలో సోదాలు జరపాల్సిన అవసరం ఏంటో అర్థం కావడం లేదన్నారు. తమను రాజకీయంగా ఎదుర్కోలేక బీజేపీ చేస్తున్న బెదిరింపు రాజకీయాలు ఫలించవని పేర్కొన్నారు. కాగా, ఈడీ ఏ ఉద్దేశ్యంతో దాడులు చేసినా తాను మాత్రం విచారణకు పూర్తిగా సహకరిస్తానని మంత్రి సెంథిల్ బాలాజీ పేర్కొన్నారు.
తమ పార్టీ ప్రతిష్ఠను దెబ్బ తీయడానికే ఈడీ దాడులు చేస్తున్నదని డీఎంకే సీనియర్ నేత ఆర్ఎస్ భారతి ఆరోపించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ర్టానికి వచ్చి వెళ్లిన వెంటనే ఈడీ దాడులు జరుగుతున్నాయని అన్నారు. తమ పార్టీపై ఏ ఆరోపణలూ నిరూపితం కాలేదన్నారు.