చెన్నై: కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) చేపట్టడం ‘పౌరుల హక్కులపై దాడి’ అని తమిళనాడు ప్రభుత్వం ఆరోపించింది. ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో ఆదివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేస్తూ 2026లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాతే రాష్ట్రంలో సర్‌ను చేపట్టాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది.
సర్ ప్రక్రియను కనుక ఎన్నికల సంఘం నిలిపివేయకపోతే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించింది. సర్‌పై అనుమానాలు వ్యక్తం చేసిన సమావేశం అమలులో ఉన్న ఆచరణాత్మక ఇబ్బందులను ప్రస్తావించింది. ఓటర్ల ప్రయోజనాల కోసం స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేయాల్సిన ఎన్నికల సంఘం కేంద్రంలోని అధికార పార్టీ ఆదేశాలకు అనుగుణంగా తలాడిస్తూ వ్యవహరిస్తున్నదని ఆరోపించింది.