బెంగళూరు: తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయాలన్న ఆదేశాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు శుక్రవారం కర్ణాటక రాష్ట్ర బంద్ పాటిస్తున్నాయి. దీంతో సాధారణ జన జీవనానికి ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. అనేక సంఘాలు కలిసి కన్నడ ఒక్కుట పేరుతో ఏకమై ఈ బంద్‌కు పిలుపునిచ్చాయి. బెంగళూరు నగరంలో టౌన్ హాల్ నుంచి ఫ్రీడం పార్క్ వరకు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని ప్రకటించాయి. యావత్తు కర్ణాటక ప్రయోజనాల కోసం తాము బంద్ నిర్వహిస్తున్నామని, అన్ని హైవేలు, టోల్ గేట్లు, రైల్వేలు, విమానాశ్రయాలను మూసివేయిస్తామని తెలిపాయి. ఈ బంద్‌కు ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్లతోపాటు హోటళ్లు, ఆటోరిక్షాల సంఘాలు కూడా మద్దతు పలికాయి. అయితే ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా సేవలను సాధారణంగానే కొనసాగించాలని స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లను రాష్ట్ర రవాణా శాఖ ఆదేశించింది.
సినీ నటుడు సిద్ధార్థ్‌కు కావేరి సెగ తగిలింది. ‘చిక్కు’ సినిమా ప్రమోషన్, స్పెషల్ స్క్రీనింగ్ కోసం ఆయన గురువారం బెంగళూరు వచ్చారు. అయితే తమిళనాడుకు కావేరీ జలాల విడుదలను వ్యతిరేకిస్తున్న నిరసనకారులు ఆయన వద్దకు వెళ్లి, ఓ తమిళ నటుడు తన సినిమాను కర్ణాటకలో ప్రమోట్ చేసుకోవడానికి ఇది సరైన సమయం కాదని చెప్పారు. కర్ణాటక నీటి సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నదని, శుక్రవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చామని, ప్రెస్ మీట్ నిర్వహించవద్దని చెప్పారు. దీంతో సిద్ధార్థ ప్రెస్ మీట్ నుంచి వెళ్లిపోయారు.