Tamil Nadu : తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికల్లో 58 ఏళ్ల అన్నాడీఎంకే (AIADMK) అభ్యర్థిని లీమా రోజ్ (Leema Rose) అత్యధిక సంపన్నురాలిగా నిలిచారు. ఆమె కుటుంబ ఆస్తుల విలువ రూ.5,863 కోట్లు కాగా, స్వయంగా ఆమె ఆస్తుల విలువే రూ.1,049 కోట్లుగా ఉన్నది. తిరుచ్చి (Trichhi) జిల్లా లాల్గుడి నియోజకవర్గం (Lalgudi Constituency) నుంచి లీమా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు. లీమా లాటరీ టికెట్ల విక్రయ సంస్థ అధినేత మార్టిన్ (Martin) సతీమణి. ఆమె ఇటీవలే అన్నాడీఎంకే పార్టీలో చేరారు.
సోమవారం లీమా తన నామినేషన్‌తోపాటు సమర్పించిన అఫిడవిట్లో ఆస్తుల వివరాలను వెల్లడించారు. తన పేరిట 19 కిలోల బంగారం, 1,217 క్యారెట్ల వజ్రాలు, 13 కిలోల వెండి, 33 గ్రాముల ప్లాటినం ఉన్నాయని ఆమె తెలిపారు. తనకు రూ.139.63 కోట్ల చరాస్తులు, రూ.909.94 కోట్లు స్థిరాస్తులు, రూ.8.57 కోట్ల అప్పులు ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా తన భర్త మార్టిన్ పేరిట రూ.4,100 కోట్ల పైచిలుకు ఆస్తులు ఉన్నాయని వెల్లడించారు. అందులో రూ.887.36 కోట్ల విలువైన చరాస్తులు, రూ.3,262 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయని తెలిపారు.
అదేవిధంగా తన భర్త పేరిట 281 గ్రాముల బంగారం, 9.83 క్యారెట్ల వజ్రాలు, 21 కిలోల వెండి, 321 గ్రాముల విలువైన ముత్యాలు ఉన్నాయని లీమా తన అఫిడవిట్లో స్పష్టంచేశారు. కుమారుడు జోస్ చార్లెస్ మార్టిన్ పేరిట కూడా రూ.655 కోట్లు విలువైన ఆస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. తన కుటుంబం మొత్తం ఆస్తుల విలువ సుమారుగా రూ.6 వేల కోట్లు ఉంటుందని తెలిపారు. అదేవిధంగా ఆమె ఆరో తరగతి వరకు మాత్రమే చదువుకున్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. తనపై నాలుగు పెండింగ్ కేసులు కూడా ఉన్నట్లు వెల్లడించారు.