CM Vijay : తమిళనాడు రైతులకు సీఎం విజయ్ శుభవార్త చెప్పారు. సహకార బ్యాంకుల్లో రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా సహకార బ్యాంకుల్లో వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతులకు గరిష్టంగా రూ.50,000 వరకు రుణమాఫీ లభిస్తుంది. ఈ పథకం వర్తించని ధనిక రైతులకు కూడా రూ.5,000 సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అది కూడా సహకార బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారికే.
విజయ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా పేద, సన్నకారు రైతులకు అప్పుల నుంచి భారీ ఊరట లభించనుంది. ప్రభుత్వ నిర్ణయం వల్ల తమిళనాడులోని 14.22 లక్షల మంది రైతులకు మేలు జరగనుంది. ఈ రుణ మాఫీ వల్ల ప్రభుత్వానికి రూ.2,044 కోట్ల భారం పడుతుంది. ఇటీవలి కాలంలో సీఎంగా విజయ్ తీసుకున్న కీలక నిర్ణయం ఇది. మరోవైపు కావేరి నదిపై కర్ణాటక ప్రభుత్వం చేపట్టనున్న మేకేడాటు డ్యామ్ ప్రాజెక్ట్ నిర్మాణంపై కూడా అధికారులతో సీఎం విజయ్ చర్చించారు. కర్ణాటక చేపట్టనున్న ఈ ప్రాజెక్టును తమిళనాడు వ్యతిరేకిస్తోంది.
దీనివల్ల తమ రాష్ట్రంలోని రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తమిళనాడు ప్రభుత్వం వాదిస్తోంది. కావేరి నదీ జలాల విషయంలో తమిళనాడు, కర్ణాటక మధ్య దశాబ్దాలుగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇక, మేకేడాటు డ్యామ్ ప్రాజెక్ట్‌కు ఇటీవలే కర్ణాటక ప్రభుత్వం భూమి పూజ నిర్వహించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా తమ రైతుల హక్కులకు నష్టం జరుగుతుందనేది తమిళనాడు ప్రభుత్వ వాదన. ఈ విషయంలో గతంలో తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను ఇటీవలే సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ అంశం కేంద్ర నిపుణుల పరిధిలోకి వస్తుందని సుప్రీం కోర్టు తెలిపింది.
కోర్టు ఆదేశాలను దృష్టిలో పెట్టుకుని తదుపరి న్యాయబద్ధమైన చర్యలను వేగవంతం చేయాలని సీఎం విజయ్ ఆదేశించారు. మేకేడాటు డ్యామ్ ప్రాజెక్ట్ ద్వారా తమ రాష్ట్రానికి తాగునీటి సమస్య తీరుతుందని, విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగపడుతుందని కర్ణాటక ప్రభుత్వం చెబుతోంది.