తిరువల్లూర్: మీ పప్పులు ఎక్కడైనా ఉడుకుతాయేమో కాని, మా వద్ద కాదని, ఢిల్లీ పాలకులకు తమిళనాడు ఎన్నడూ తల వంచదని ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు. ఢిల్లీ నుంచి వచ్చే ఏ శక్తి కూడా ఎప్పటికీ దక్షిణాది రాష్ర్టాన్ని పాలించ లేదని అన్నారు. తమిళ నాడులోని విపక్ష ఏఐఏడీఎంకేతో బీజేపీ ఎన్నికల పొత్తు పెట్టుకున్న క్రమంలో 2026లో తామే అధికారంలోకి వస్తామని అమిత్ షా ప్రకటించడంపై తిరువల్లూర్ సభలో ఆయన మాట్లాడుతూ ‘నేను ఆయనకు సవాల్ విసురుతున్నా.. భయపెట్టి, పార్టీలను చీల్చే, కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించే కేంద్రం వేధింపుల ఫార్ములా దేశంలో ఎక్కడైనా పనిచేస్తుందేమో కానీ తమిళనాడులో మాత్రం పనిచేయదు.
అమిత్ షాయే కాదు, ఏ షా కూడా తమిళ నాడును పాలించలేరు’ అని అన్నారు. తమ ప్రభుత్వానికి నిజాయితీ లేదని, ప్రజలు అనాగరికులంటూ ఇటీవల కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన విమర్శలను ఆయన ప్రస్తావిస్తూ.. అలాంటి వ్యాఖ్యల ద్వారా రాష్ర్టాన్ని విభజించాలనుకునే అలాంటి ప్రయత్నాలు తప్పక విఫలమవుతాయని అన్నారు.
నీట్, త్రిభాషా విధానాలపై తాము దృష్టి మళ్లింపు రాజకీయాలు చేస్తున్నామని విమర్శించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఆ సమస్యలపై రాష్ట్ర ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పగలరా? అని స్టాలిన్ సవాల్ చేశారు. నీట్, త్రిభాషా పాలసీ, వక్ఫ్ బిల్లు వల్ల కొన్ని రాష్ర్టాలు ప్రభావితం అవుతాయని, అందుకే తాము దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆయన చెప్పారు.