చెన్నై: స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో తమిళనాడు సీఎం స్టాలిన్.. మోదీ ప్రభుత్వంపై పదునైన విమర్శలు చేశారు. కేంద్రం రాష్ర్టాల హక్కులను లాక్కుంటున్నదని ఆరోపిస్తూ, రాష్ర్టాలకు అధికారాలు, ఆర్థిక స్వయంప్రతిపత్తిని పునరుద్ధరించడానికి రాజ్యాంగబద్ధమైన చర్య తీసుకోవాలని కోరారు. దీని తర్వాత కొన్ని గంటలకు తమ ప్రభుత్వం గవర్నర్ నిర్వహించే ‘ఎట్ హోమ్’ను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. కేంద్ర చట్టాలు, కోర్టు తీర్పుల ద్వారా తమ రాష్ర్టానికి విడుదల చేసే నిధులలో వివక్ష చూపుతూ తమిళనాడు ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నందుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
నిధుల కోత రాష్ట్ర అభివృద్ధితో పాటు భారత సమగ్రతపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని స్టాలిన్ అన్నారు. ప్రస్తుతం రాష్ర్టాలకు అధికారాలు పెంచాల్సిన అవసరం ఉండగా, విద్య, వైద్యం, ఇతర ముఖ్యమైన రంగాలలో రాష్ర్టాల హక్కులను కేంద్రం హరిస్తున్నదని ఆయన తీవ్రంగా విమర్శించారు. రాజ్యాంగ పరిష్కారం కనుగొనడమొక్కటే ఈ సమస్యకు ఏకైక పరిష్కారమని ఆయన అన్నారు. అలా చేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన అధికారం, నిధుల వికేంద్రీకరణ జరుగుతుందన్నారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టాలంటే న్యాయస్థానాలను ఆశ్రయించాల్సిన ప్రస్తుత పద్ధతి దేశ సమాఖ్య సూత్రాలకు అనుగుణంగా లేదని ఆయన అన్నారు.
భారత దేశానికి సుమారు 8 దశాబ్దాల క్రితమే బ్రిటిష్ వారి నుంచి స్వేచ్ఛ లభించినా, కేంద్రంలోని బీజేపీ పాలనలో మాత్రం నిజమైన స్వాతంత్య్రం రాలేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం బెహల, హజారాలలో జరిగిన వేడుకలకు హాజరైన ఆమె మాట్లాడుతూ ఓటు హక్కును, వాక్ స్వాతంత్య్ర హక్కును, ఇతర ప్రాథమిక హక్కులను బీజేపీ ప్రభుత్వం ప్రజల నుంచి హరించి వేస్తున్నదని ఆరోపించారు. ‘78 ఏండ్ల క్రితమే భారత్కు స్వాతంత్య్రం లభించింది. అయితే ఈ ఫాసిస్టు బీజేపీ పాలనలో ప్రజలకు నిజమైన స్వాతంత్య్రం లభించ లేదు’ అని అన్నారు.