చెన్నై: తమిళనాడులోని రామేశ్వరంలో కొత్తగా నిర్మించిన పంబన్ రైల్వే బ్రిడ్జిని ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొన్న ఈ కార్యక్రమానికి సీఎం ఎంకే స్టాలిన్ గైర్హాజరయ్యారు. (Stalin skips PM’s Pamban event) అయితే న్యాయమైన డీలిమిటేషన్‌పై ప్రధాని హామీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం ఒక కార్యక్రమంలో సీఎం స్టాలిన్ మాట్లాడారు. ప్రతిపాదిత డీలిమిటేషన్ కసరత్తుపై తమిళనాడు ప్రజలు భయాందోళనలు చెందుతున్నారని తెలిపారు.
కాగా, తమిళనాడు ప్రజల భయాలను పోగొట్టేందుకు ప్రధాని మోదీ హామీ ఇవ్వాలని ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. ‘తమిళ గడ్డపై నిలబడి, ప్రధాని స్పష్టమైన హామీ ఇవ్వాలి. తమిళనాడుతో సహా జనాభా పెరుగుదలను విజయవంతంగా నియంత్రించిన ఇతర రాష్ట్రాలకు రాబోయే డీలిమిటేషన్ కసరత్తులో ఎలాంటి జరిమానా విధించకూడదు. పార్లమెంటు సీట్లలో రాష్ట్రాల వాటా చెక్కుచెదరకుండా చూడాలి. న్యాయమైన డీలిమిటేషన్ విధానంపై పార్లమెంట్లో తీర్మానం చేయాలి’ అని అన్నారు. ప్రధాని మోదీ దీని గురించి బహిరంగంగా హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.