Tamil Nadu | పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రస్తుతం అమెరికాలో ఉన్న తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పలువురు పారిశ్రామికవేత్తలతో చర్చలు జరుపుతున్నారు. తొలి రోజు పర్యటనలో చెన్నై, కోయంబత్తూర్, మధురై, చెంగల్పట్టులో వివిధ ప్రాజెక్టుల కోసం రూ. 900 కోట్ల పైగా పెట్టుబడుల హామీలు వచ్చాయని వీటి ద్వారా వివిధ రంగాల్లో 4100 నూతన ఉద్యోగాలు సమకూరతాయని ఎక్స్ పోస్ట్‌లో స్టాలిన్ వివరించారు.
నోకియా రూ. 450 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించిందని, దీంతో 100 ఉద్యోగాలు, పేపాల్‌లో 1000 ఉద్యోగాలు, ఈల్డ్ ఇంజనీరింగ్ సిస్టమ్స్ ద్వారా రూ. 150 కోట్ల పెట్టుబడులతో 300 ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఇక మైక్రోచిప్ రూ. 250 కోట్ల పెట్టుబడులు పెట్టనుందని 1500 ఉద్యోగాలు రానున్నాయని పేర్కొన్నారు.
ఇన్ఫినిక్స్ పెట్టుబడులతో 700 ఉద్యోగాలు, అప్లైడ్ మెటీరియల్స్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా 500 ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. రెండు వారాల పర్యటనలో పెద్దసంఖ్యలో వివిధ కంపెనీలు భారీ పెట్టుబడులతో తమిళనాడుకు తరలివస్తాయని స్టాలిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. శాన్ఫ్రాన్సిస్కో ఇన్వెస్ట్మెంట్ కాంక్లేవ్‌లో స్టాలిన్ మాట్లాడుతూ తమిళనాడును ట్రిలియన్ డాలర్ ఎకానమీగా ఎదిగేలా చర్యలు చేపడతామని చెప్పారు.
Read More :