చెన్నై, మార్చి 27: నియోజకవర్గాల పునర్విభజన, భాషా విధానంపై తమ పాలసీని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విమర్శించడాన్ని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తప్పుబట్టారు. యోగి తమకు పాఠాలు నేర్పడం పొలిటికల్ బ్లాక్ కామెడీలా ఉందని ఎద్దేవా చేశారు. ప్రాంతం, భాష ఆధారంగా చీలికలు తేవడానికి స్టాలిన్ ప్రయత్నిస్తున్నారని, దాని కారణంగా దేశం బలహీన పడుతుందని ఇటీవల యోగి చేసిన విమర్శలపై స్టాలిన్ ఎక్స్‌లో గురువారం స్పందించారు.
డీలిమిటేషన్ పేరుతో జరిగే పార్లమెంట్ నియోజక వర్గాల పెంపు న్యాయబద్ధంగా ఉండాలని తాము కోరుకుంటున్నామని ఆయన చెప్పారు. ద్వి భాషా విధానం, డీలిమిటేషన్‌లపై రాష్ర్టాలు న్యాయమైన, దృఢమైన స్వరం విన్పించడంతో పాటు దేశ వ్యాప్తంగా కదలిక తెచ్చామని, ఇది బీజేపీ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిస్తున్నట్టు కన్పిస్తున్నదని అన్నారు.
‘సీఎం యోగి ఆదిత్యనాథ్ విద్వేషంపై మాకు ఉపన్యాసాలు ఇవ్వాలనుకుంటున్నారా? వదిలేయండి. ఇది వ్యంగ్యం కాదు, రాజకీయంగా చీకటి కామెడీ’ అని ఆయన దీటుగా సమాధానం చెప్పారు. డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించడం అభినందనీయమని స్టాలిన్ అన్నారు.