అహ్మదాబాద్: ఒక టైలర్‌కు ఏకంగా లక్షల్లో కరెంట్ బిల్లు వచ్చింది. రూ.86 లక్షలు వచ్చిన విద్యుత్ బిల్లు చూసి అతడు షాకయ్యాడు. ( Rs.86 Lakh Power Bill) ఆందోళన చెందిన అతడు వెంటనే సంబంధిత అధికారులను కలిశాడు. అయితే తప్పుడు మీటర్ రీడింగ్ వల్ల ఈ పొరపాటు జరిగినట్లు వారు గ్రహించారు. గుజరాత్‌లోని వల్సాద్‌లో ఈ సంఘటన జరిగింది. చోర్ గలి ప్రాంతానికి చెందిన అన్సారీ తన బంధువుతో కలిసి టైలరింగ్ షాపు నిర్వహిస్తున్నాడు. అతడికి సాధారణంగా రూ.2,000 లోపు కరెంట్ బిల్లు వచ్చేది.
కాగా, గత నెలలో విద్యుత్ వినియోగానికి గాను ఏకంగా రూ.86 లక్షల మేర పవర్ బిల్లు వచ్చింది. ఇది చూసి అన్సారీ షాక్ అయ్యాడు. ఆందోళన చెందిన అతడు స్థానిక విద్యుత్ కార్యాలయానికి వెళ్లి ఆ బిల్లు చూపించాడు.
మరోవైపు విద్యుత్ శాఖ సిబ్బంది అన్సారీ షాపును సందర్శించారు. అతడి కరెంట్ మీటర్‌ను చెక్ చేశారు. మీటర్ రీడింగ్ తీసుకున్న వ్యక్తి వినియోగించిన యూనిట్లకు 10 అంకెలు కలిపినట్లు తెలుసుకున్నారు. పొరపాటు జరిగినట్లు గ్రహించారు. రూ.1,540కు సవరించిన కరెంట్ బిల్లు అన్సారీకి ఇచ్చారు. దీంతో ఈ ఆందోళన నుంచి అతడు ఊరట చెందాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న స్థానికులు రూ.86 లక్షల కరెంట్ బిల్లును ఫొటో తీసుకునేందుకు పోటీ పడ్డారు.