Tahawwur Rana | ముంబై 26/11 పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడైన తహవ్వూర్ హుస్సేన్ రాణా (Tahawwur Rana) జ్యుడీషియల్ కస్టడీ (judicial custody)ని ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు (Patiala House Court) మరోసారి పొడిగించింది. ఇప్పటికే ఆయనకు విధించిన కస్టడీ నేటితో ముగియడంతో రాణాను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 13 వరకు కస్టడీని పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు ఉగ్రదాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) పాటియాలా హౌస్ కోర్టులో అనుబంధ ఛార్జిషీట్ దాఖలు (supplementary chargesheet) చేసింది. ఈ కేసులో తహవ్వూర్ రాణా పేరును ఛార్జిషీట్లో పొందుపరిచింది. ఎన్ఐఏ దాఖలు చేసిన ఈ ఛార్జిషీట్‌ను ఆగస్టు 13న కోర్టు పరిశీలించనుంది. అప్పటి వరకూ రాణా ఎన్ఐఏ కస్టడీలోనే ఉండనున్నారు.
పాక్ సైన్యానికి నమ్మకమైన ఏజెంట్‌ను..!
ముంబై 26/11 పేలుళ్ల కేసులో రాణా నేరాన్ని అంగీకరించినట్లు ఇటీవలే వార్తలు వచ్చాయి. ముంబై ఉగ్రదాడి వెనుక తన పాత్ర ఉందన్న సంగతిని ఎన్ఐఏ విచారణలో అతడు అంగీకరించినట్టు జాతీయ మీడియా పేర్కొంది. పాక్ సైన్యానికి నమ్మకమైన ఏజెంట్‌గా ఉన్నాననే సంగతిని ఎన్ఐఏ అధికారులకు అతడు తెలిపినట్టు సమాచారం. అంతేకాదు తాను, తన స్నేహితుడైన డేవిడ్ హెడ్లీకి పాక్‌కు చెందిన లష్కరే తాయిబాతో సంబంధాలు ఉన్నట్టు కూడా రాణా అంగీకరించినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. పాకిస్థాన్ సంతతికి చెందిన కెనడా పౌరుడు తహవ్వూర్ హుస్సేన్ రాణా ముంబై పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. మరో ఉగ్రవాది డేవిడ్ హెడ్లీతో అతడికి సన్నిహిత సంబంధాలున్నాయి.
ముంబై పేలుళ్ల కేసులో రాణా ప్రధాన నిందితుడు. అతడు పాకిస్థాన్ సంతతికి చెందిన కెనడా పౌరుడు. ముంబై ఉగ్రదాడి కుట్రదారు డేవిడ్ కోల్మాన్ హెడ్లీతో తహవూర్ రాణాకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఇద్దరూ కలిసి ఉగ్రదాడికి ప్రణాళిక రచించారు. దాడి అనంతరం అమెరికాకు పారిపోయాడు. 2009లో రాణాను అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి అమెరికాలోని జైలులో శిక్ష అనుభవిస్తున్న రాణాను అగ్రరాజ్యం ఇటీవలే భారత్‌కు అప్పగించింది. ప్రస్తుతం అతడు ఎన్ఐఏ కస్టడీ (NIA custody)లో ఉన్నారు.
కాగా భారత్‌లో అక్రమంగా చొరబడిన 10 ఉగ్రవాదులు 2008 నవంబర్ 26న తమ నరమేథం మొదలుపెట్టారు. రెండు లగ్జరీ హోటళ్లు, రైల్వేస్టేషన్, జెవిస్ సెంటర్ ఇలా నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో ఏకంగా 60 గంటలపాటు సాగిన నరమేథంలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో పలువురు భద్రతాసిబ్బంది కూడా ఉన్నారు. భద్రతా బలగాల దాడిలో 9 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. మరో ఉగ్రవాది కసబ్‌ను ప్రాణాలతో పట్టుకున్నారు. ఆ తర్వాత అతడికి ఉరిశిక్ష విధించారు.
Also Read..
PM Modi | వంతెన కూలిన ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన
Bridge Collapses | వంతెన కూలిన ఘటనలో తొమ్మిది మంది మృతి
UIDAI | ఆధార్ ఎప్పుడూ మొదటి గుర్తింపు కాదు : ఉడాయ్