Bridge Collapses | గుజరాత్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. వడోదర (Vadodara) జిల్లాలోని మహిసాగర్ నది (Mahisagar river)పై ఉన్న గంభీర్ వంతెన (Gambhira bridge) బుధవారం ఉదయం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది (Bridge Collapses). దీంతో పలు వాహనాలు నదిలో పడిపోయాయి. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య తాజాగా తొమ్మిదికి పెరిగింది.
గుజరాత్‌లోని వడోదర-ఆనంద్ పట్టణాలను కలుపుతున్న ఈ వంతెనను 45 ఏళ్ల క్రితం నిర్మించారు. అయితే, చాలా కాలంగా ఈ వంతెన శిథిలావస్థకు చేరినట్లు స్థానికులు తెలిపారు. తాజా ఘటనతో ఆ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. మరోవైపు ప్రమాద స్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నదిలో పడిన వాహనాలను తొలగించడానికి వడోదర అగ్నిమాపక శాఖ బృందాలు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాలు (NDRF) చర్యలు తీసుకుంటున్నాయి. మరోవైపు ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
బీజేపీ డబుల్ ఇంజిన్ మోడల్ మరోసారి బట్టబయలు..
వంతెన కూలిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పందించారు. ఈ ఘటనతో బీజేపీ డబుల్ ఇంజిన్ మోడల్ మరోసారి బట్టబయలు అయిందని కేటీఆర్ పేర్కొన్నారు. ‘మోర్బీ వంతెన కూలి 140 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషాదం మరువకముందే, డబుల్ ఇంజన్ బీజేపీ సర్కార్ ఉన్న గుజరాత్లో మరో వంతెన నదిలో కూలిపోయింది. గుజరాత్లో, డబుల్ ఇంజిన్ ఉన్న బీహార్, మధ్యప్రదేశ్‌లలో వంతెనలు వరుసగా ఎందుకు కూలుతున్నాయి..? వీటిపై ఎన్డీఎస్ఏ లేదా ఇతర భద్రతా సంస్థలు విచారణ జరుపుతాయా..? ఇదేనా మీరు గొప్పలు చెప్పుకునే గుజరాత్ ‘మోడల్’? ప్రజల ప్రాణాలు తీసే నిర్లక్ష్యంపై బీజేపీ సమాధానం చెప్పాలి..!’ అని డిమాండ్ చేశారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
Also Read..
UIDAI | ఆధార్ ఎప్పుడూ మొదటి గుర్తింపు కాదు : ఉడాయ్
Amarnath Yatra | కొనసాగుతున్న అమర్నాథ్ యాత్ర.. తొలి ఆరు రోజుల్లోనే లక్ష మందికిపైగా దర్శనం
Google AI Mode | భారత్‌లో అందుబాటులోకి గూగుల్ ఏఐ మోడ్