Delimitation Row | న్యూఢిల్లీ, మార్చి 5 : వచ్చే ఏడాది తలపెట్టిన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను డీఎంకే నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశం ఏకగ్రీవంగా తిరస్కరించింది. నియోజకవర్గాల పునర్విభజన తమిళనాడును బలహీనపరుస్తుందని, అది భారత ఫెడరల్ స్వభావానికి ముప్పు అని పేర్కొంటూ సమావేశం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. డీలిమిటేషన్, బలవంతంగా హిందీ అమలును వ్యతిరేకిస్తూ డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వం వహించిన అఖిలపక్ష భేటీకి ప్రతిపక్ష అన్నాడీఎంకే, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు, సినీనటుడు విజయ్‌కి చెందిన వీసీకే తదితర పార్టీలు హాజరు కాగా, బీజేపీ, దాని మిత్రపక్షాలైన ఎన్టీకే, తమిళ మానిళ కాంగ్రెస్ ఈ సమావేశాన్ని బహిష్కరించాయి. త్వరలో చేపట్టనున్న జనగణన ఆధారంగా నియోజకవర్గాలను పునర్విభజించడం వల్ల తమిళనాడుతోపాటు దక్షిణాది రాష్ర్టాల రాజకీయ ప్రాతినిధ్య హక్కులు ప్రభావితం అవుతాయని సమావేశంలో ఆమోదించిన తీర్మానంలో పేర్కొన్నారు.
జనాభా నియంత్రణ చర్యలు చేపట్టిన దక్షిణాది రాష్ర్టాల ప్రాతినిధ్యాన్ని పార్లమెంట్లో తగ్గించడం సహించరానిదని మండిపడ్డారు. 1970 నాటి జనగణన ఆధారంగా జరిగిన పార్లమెంటరీ సీట్ల పునర్విభజనను యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. యథాతథస్థితిని కనీసం మరో 30 ఏండ్లు కొనసాగించాలని స్టాలిన్ అన్నారు. ఈలోగా ఇతర రాష్ర్టాలకు కూడా జనాభాను నియంత్రించేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఒకవేళ ఎంపీ సీట్ల సంఖ్యను పెంచినట్లయితే ఆ మేరకు రాష్ర్టాల వారీగా దామాషా ప్రాతినిధ్యాన్ని నిర్ధారించాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా జరిగే ఈ పోరాటంలో దక్షిణాది రాష్ర్టాలలోని ఇతర పార్టీలను కూడా కలుపుకొని జాయింట్ యాక్షన్ కమిటీని రూపొందించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
తమిళ భాషపై ప్రధాని మోదీ మాటల్లో చూపించిన ప్రేమ చేతల్లో కనిపించడం లేదని స్టాలిన్ విమర్శించారు. తమిళనాడులోని కేంద్రప్రభుత్వ కార్యాలయాల నుంచి ముందుగా హిందీని తొలగించి హిందీతో సమానంగా తమిళ భాషను అధికార భాషగా ప్రకటించాలని ప్రధానిని డిమాండ్ చేశారు.
1971 జనాభా లెక్కల ఆధారంగా ఏర్పడిన 543 లోక్‌సభ స్థానాలను నిరవధికంగా స్తంభింపచేయాలని తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ బుధవారం డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన తమిళనాడుతోసహా ఇతర దక్షిణాది రాష్ర్టాలలో సీట్లు తగ్గితే అది శిక్షగా పరిగణించాల్సి వస్తుందని ఆయన అన్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ర్టాలకు అదనపు సీట్లు లభించి దక్షిణాది రాష్ర్టాలకు సీట్లు తగ్గితే తమకు ఆమోద యోగ్యం కాదని అఖిలపక్ష సమావేశానికి ముందు విడుదల చేసిన ఐదు పేజీల లేఖలో విజయ్ స్పష్టం చేశారు.
హిందీయేతర రాష్ర్టాలలో హిందీని అధికార భాషగా చేపట్టాలంటూ బలవంతం చేయడం ద్వారా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ‘ఇండియాను హిందియాగా’ మార్చాలనుకుంటున్నదని సినీనటుడు కమల్‌హాసన్ విమర్శించారు. అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని రాష్ర్టాలలో హిందీని రుద్దడం ద్వారా బీజేపీ ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నదని ఆరోపించారు. మన కల ఇండియా.. వారి కల హిందియా అని వ్యాఖ్యానించారు. లోక్‌సభ సీట్ల సంఖ్యను యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.