సోన్‌భద్ర: పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ కొన్ని పొదుపు సూచనలు చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ పర్యటన సమయంలోఆయన బహిరంగ సభలో పాల్గొని కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలన్నారు. బంగారం కొనుగోళ్లను ఏడాది పాటు ఆపాలన్నారు. డీజిల్, పెట్రోల్ వినియోగాన్ని తగ్గించుకోవాలన్నారు. ప్రజా రవాణా వ్యవస్థపై ఎక్కువగా ఆధారపడాలని సూచించారు. రాబోయే కరువు, దారిద్ర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధాని మోదీ ఆ సూచన చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రధాని పొడుపు సూచనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
దుబారా ఖర్చులు చేయవద్దు అంటే ముందుగా ప్రధాని వినియోగించే సుమారు 8 వేల కోట్ల ఖరీదైన ఎయిర్ ఇండియా వన్ విమానాన్ని అమ్మేయాలని స్వామి అవిముక్తేశ్వరానంద(Swami Avimukteshwaranand) అన్నారు. ఆ విమానానికి బదులుగా ఇంధనం తక్కువ ఖర్చు అయ్యే విమానాలను వాడాలని స్వామీజీ విమర్శించారు. ఖర్చులు తగ్గించుకోవాలని ప్రజలకు చెప్పడం కాదు, ముందుగా ఆ విమానాన్ని అమ్మేసేయాలని ఆయన అన్నారు.
యూపీలోని సోన్భద్రతలో జరిగిన గోవిష్ట్ యాత్రలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పొదుపు అనేది అధికారంలో ఉన్న వ్యక్తుల నుంచే మొదలు కావాలని ఆయన అన్నారు. ధర్మం అనేది ఇంటి నుంచే మొదలు కావాలని అవిముక్తేశ్వరానంద అభిప్రాయపడ్డారు.