కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ తదుపరి సీఎంగా బీజేపీ నాయకుడు సువేందు అధికారి నియమితులయ్యారు. పశ్చిమ బెంగాల్లో ఏర్పడిన తొలి బీజేపీ ప్రభుత్వానికి సారథిగా ఆయన నిలువనున్నారు. బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా సువేందు అధికారి ఎన్నికైనట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. కోల్‌కతాలో జరిగిన బీజేపీ సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ నేటి విజయం అనేక కోణాల నుంచి అత్యంత ముఖ్యమైనదని, వందేండ్ల సైద్ధాంతిక ప్రయాణం తర్వాత ఈరోజు గంగోత్రి నుంచి గంగాసాగర్ వరకు ప్రతిచోటా బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడ్డాయని అన్నారు.
కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో శనివారం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ర్టాల ముఖ్యమంత్రుల సమక్షంలో బెంగాల్లో కొత్త బీజేపీ ప్రభుత్వం ప్రమాణం చేయనున్నది. బెంగాల్ ప్రభుత్వం అధికారిక ఏర్పాటు ప్రక్రియకు ముందు లోక్‌భవన్ వద్ద సన్నాహాలు జరుగుతున్నాయి.
రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరుతూ సువేందు అధికారి గవర్నర్‌ను కలిశారు. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో స్థానిక పుత్రుడినే ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటామని బీజేపీ నాయకులు పదేపదే ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికల్లో బీజేపీ గెలుపొందిన తర్వాత సువేందు అధికారి పేరే ముఖ్యమంత్రి ఎంపికలో ముందుగా తెరపైకి వచ్చింది.