కోల్కతా, మే 9: పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. మూడు దశాబ్దాలకు పైగా వామపక్షాలు, 15 ఏండ్ల పాటు టీఎంసీ నేతృత్వంలోని మమతా బెనర్జీ రాష్ర్టాన్ని పాలించగా, తొలిసారిగా బీజేపీ అధికారంలోకి వచ్చింది. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో 55 ఏండ్ల సువేందు అధికారి చేత గవర్నర్ ఆర్ఎన్ రవి 9వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనతో పాటు బీజేపీ నేతలు దిలీప్ ఘోష్, అగ్నిమిత్ర పాల్, అశోక్ కీర్తనియా, క్షుదిరామ్ తుడు, నిషిత్ పర్మానిక్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఒకప్పుడు మమతకు సహాయకుడిగా పనిచేసిన సువేందు అధికారి ఆమె కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. తర్వాత ఆమె మేనల్లుడితో విభేదించి టీఎంసీ నుంచి బయటకు వచ్చిన ఆయన 2020లో బీజేపీలో చేరారు. తర్వాత ఆమెను నందిగ్రామ్, భవానీపూర్ లలో ముఖాముఖీ ఎన్నికల్లో రెండుసార్లు ఓడించడమే కాక, ఇప్పుడు ఏకంగా అమెను శాసనసభ ఎన్నికల్లో చిత్తు చేసి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత నేతలు, సీఎంలు హాజరయ్యారు.
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటలకే సువేందు అధికారి రాష్ట్రంలో శాంతి భద్రతలు, సంక్షేమ పథకాల అమలును సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ నారియాలా, రాష్ట్ర డీజీపీ సిద్ధ్ నాథ్ గుప్తా, ఇతర పోలీస్ అధికారులు, ఉన్నతాధికారులతో శాంతిభద్రతలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి కోల్కతా పోలీస్ కమిషనర్ అజయ్ నంద్ కూడా హాజరయ్యారని తెలిసింది. గత సర్కార్ ప్రవేశపెట్టిన వివిధ పథకాల అమలు తీరుపైనా సువేందు ఆరా తీసినట్టు సమాచారం.
కొత్తగా కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయ పునర్వ్యవస్థీకరణపై దృష్టి సారించింది. సీఎం సువేందు అధికారి సలహాదారుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుబ్రతా గుప్తాను ప్రభుత్వం నియమించింది. గుప్తా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ‘సర్’కు ప్రత్యేక ఎన్నికల పరిశీలకునిగా(ఎస్ఆర్ఓ) బాధ్యతలు నిర్వహించారు.