Road Accident | మహారాష్ట్రలోని పుణెలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. నాసిక్ – పుణే హైవేపై వేగంగా రోడ్డు దాటుతున్న మహిళలను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. శిరోలి గ్రామ శివారులో ఈ దుర్ఘటన జరిగింది. దాదాపు 17 మంది మహిళల బృందం హైవేను దాటేందుకు యత్నిస్తున్నది.
వీరంతా హైవేకి అవతలి వైపు ఉన్న కల్యాణ మండపంలో క్యాటరింగ్ కోసం వెళ్తున్నారు. క్రమంలో పుణే వైపు నుంచి వేగంగా వచ్చిన ఎస్యూవీ మహిళలను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఐదుగురు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఎస్యూవీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.