శ్రీనగర్ : జమ్మూ డివిజన్లోని అఖ్నూర్ సెక్టార్లో అనుమానాస్పద సిలిండర్‌ను ఆర్మీ గుర్తించింది. దీంతో బాంబు స్క్వాడ్‌ను రంగంలోకి దింపి.. అనంతరం దాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించి ధ్వంసం చేశారు. ఈ సిలిండర్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై బలగాలు, పోలీసులు విచారణ జరుపుతున్నాయి. సమాచారం ప్రకారం.. గురువారం ఉదయం దోమన అసెంబ్లీ నియోజకవర్గం కానా చక్క్ పోలీస్ స్టేషన్ పరిధిలో పరాగ్వల్ రోడ్ సమీపంలో ఈ సిలిండర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
సిలిండర్‌ను గుర్తించి ప్రదేశానికి కేవలం వంద మీటర్ల దూరంలో ఆర్మీ యూనిట్ ఉన్నది. సమాచారం అందుకున్న వెంటనే ఆర్మీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌ను సంఘటనా స్థలానికి తరలించారు. కొద్దిసేపు భద్రతా బలగాలు రోడ్డును మూసివేశాయి. ఇదే సమయంలో రాకపోకలను సైతం నిలిపివేశారు. ఆ తర్వాత సురక్షిత ప్రాంతానికి తరలించి సిలిండర్‌ను జేసీబీ సహాయం గుంత తీసి, అందువేసి ధ్వంసం చేశారు. ప్రస్తుతం సిలిండర్ ఇక్కడికి ఎలా వచ్చింది? అనే విషయంపై ఆరా తీస్తున్నారు.