ఢిల్లీ, జూలై 30 (నమస్తే తెలంగాణ) : భారతదేశపు సార్వభౌమాధికారంపై ఇతర దేశాలకు ఎటువంటి హక్కు లేదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్‌రెడ్డి స్పష్టంచేశారు. రాజ్యసభలో బుధవారం ఆపరేషన్ సిందూర్‌పై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. పాకిస్థాన్‌లోని ఉగ్రమూకల ఆటకట్టించేందుకు ఆపరేషన్ సిందూర్ పేరిట మన దేశ సైనికులు చేసిన యుద్ధానికి బీఆర్ఎస్ పార్టీ పూర్తిస్థాయిలో మద్దతు ఇచ్చిందని తెలిపారు. ఆ ఆపరేషన్‌లో పాల్గొన్న సైనికులకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.
ఆపరేషన్ సిందూర్‌కు దేశ ప్రజలంతా మద్దతు ఇచ్చారని, ఇలాంటి సమయంలో యుద్ధం ఆపేందుకు తానే ముందుకువచ్చానని, తాను చెప్పడంతోనే యుద్ధం ఆగిపోయిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ట్వీట్లు, వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. వాణిజ్యం బంద్ పెడ్తామని బెదిరించడంతోనే యుద్ధం ఆగిందని ట్రంప్ చెప్పడం ఏమాత్రం మంచిదికాదని చెప్పారు. భారత్ తొలినుంచి శాంతిని కోరుకునే దేశమని, యుద్ధం ఎవ్వరికీ మంచిది కాదని, కానీ, మన సౌర్వభౌమత్వాన్ని ప్రశ్నిస్తూ.. మన దేశంపైకి ఉగ్రవాదులను పంపించినపుడు యుద్ధం తప్పదని అన్నారు.
పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో మన బలాలపై స్పష్టత వచ్చిన నేపథ్యంలో మన సాధన సంపత్తిని మరింత మెరుగుపర్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సురేశ్‌రెడ్డి సూచించారు. పాకిస్థాన్ అన్ని రంగాల్లో ముక్యంగా ఆర్థికంగా, సైనికపరంగా, అత్యంత అవినీతిమయమైన, పాలనాపరంగా ఘోరవైఫల్యాన్ని చవిచూసిందని, అందుకే ఆ దేశం టెర్రరిజాన్ని పెంచిపోషిస్తున్నదని అన్నారు. ప్రపంచదేశాలకు ఇదే విషయాన్ని వివరించి చెప్పాలని సూచించారు.
కశ్మీరులోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి, పూంచ్ తదితర ప్రాంతాల్లో మృతిచెందిన స్థానికులకు బీఆర్ఎస్ పార్టీ, అధ్యక్షుడు కేసీఆర్, తెలంగాణ ప్రజల తరఫున నివాళి అర్పిస్తున్నామని సురేశ్‌రెడ్డి పేర్కొన్నారు.