Supreme Court | కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ చట్టం చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం విచారణ ప్రారంభించింది. అయితే, వక్ఫ్ చట్టంపై స్టే విధించేందుకు నిరాకరించిన ధర్మాసనం.. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, వక్ప్ బోర్డులో ముస్లిమేతరులను చేర్చడం, వక్ఫ్ ఆస్తులపై వివాదంపై కలెక్టర్లకు అధికారాలు, కోర్టులు వక్ఫ్‌గా ప్రకటించిన ఆస్తులను డీ నోటిఫై చేయడం తదితర కీలక నిబంధనలపై సుప్రీంకోర్టు బుధవారం స్టే విధించింది. ఈ సందర్భంగా కేంద్రం ప్రభుత్వంతో పాటు ప్రతివాదులకు కోర్టు నోటీసులు జారీ చేస్తూ విచారణను గురువారం మధ్యాహ్నం 2 గంటలకు విచారణ వాయిదా వేసింది.
పిటిషనర్లు లేవనెత్తిన అంశాలకు సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ కన్నా, జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథ్‌తో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఆదేశించింది. ఈ వివాదంపై దాఖలైన పలు పిటిషన్లపై రేపు మధ్యంతర తీర్పును ఇవ్వనున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరుపుతూ.. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. వక్ఫ్ బోర్డులో తరహాలో ముస్లింలను హిందూ ట్రస్ట్‌లో భాగం చేయడానికి అనుమతించడానికి సిద్ధంగా ఉన్నారా? అని కేంద్రాన్ని నిలదీసింది. వందల ఏళ్ల నాటి వక్ఫ్ ఆస్తులకు ఇప్పుడు పత్రాలు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించింది.
సుదీర్ఘకాలంగా ముస్లిం కార్యక్రమాలకు వాడుతున్న (వక్ఫ్ బై యూజర్) ఆస్తులను డినోటిఫై చేస్తే అనేక సమస్యలు తలెత్తుతాయని పేర్కొంది. వక్ఫ్ బై యూజర్ ఆస్తులను రిజిస్టర్ చేయడం కష్టమని.. ఇది పలుమార్లు దుర్వినియోగమైందని ధర్మాసనం పేర్కొంది. నిజంగా ముస్లిం ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న ఆస్తులు ఉన్నాయని.. హిందువుల ఆస్తులను హిందువులే నిర్వహిస్తున్నారు కదా? అని ప్రశ్నించింది. పార్లమెంటుకు చట్టాలు చేసే అధికారం లేదా? హిందువుల కోసం కూడా పార్లమెంట్ చట్టాలు చేస్తుంది కదా? ఢిల్లీ హైకోర్టు కూడా వక్ఫ్ భూమిలోనే ఉందని అంటున్నారని.. చారిత్రక, పురావస్తు ఆస్తులను వక్ఫ్‌గా ప్రకటించడానికి వీలు లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. వక్ఫ్ చట్టంలోని అభ్యంతరాలను ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చిన ఆయన.. వక్ఫ్ కొత్త చట్టంలోని అనేక నిబంధనలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 26ను ఉల్లంఘిస్తున్నాయని తెలిపారు. కొత్త చట్టం ప్రకారం.. కలెక్టర్‌కు ఇచ్చే అధికారాలను సిబల్ ప్రస్తావించారు. కలెక్టర్ ప్రభుత్వంలో ఒక భాగమని, ఆయన న్యాయమూర్తి పాత్ర పోషిస్తే అది రాజ్యాంగ విరుద్ధమేనన్నారు. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను చేర్చే నిబంధనను కోర్టుకు దృష్టికి తీసుకొచ్చారు. ముస్లింల హక్కులను కాలరాసేలా పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టారన్నారు.
వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతోన్న ఆందోళనల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం బాధకరమని, హింసాత్మక ఘటనలు తమను తీవ్రంగా బాధించాయని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు చేస్తూ.. రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. చట్టంపై స్టే విధించాలన్న పిటిషనర్ల అభ్యర్థనను తోసిపుచ్చింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. జేపీసీ ద్వారా సంపూర్ణంగా అన్నివర్గాలతో చర్చలు జరిపామని చెప్పారు. వక్ఫ్ అనేది కేవలం చారిటీకి సంబంధించిదేనని.. హిందూ ధార్మిక సంస్థలను సైతం ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయని గుర్తు చేశారు.