Supreme Court | క్రమశిక్షణ అనేది సాయుధ దళాల సేవల్లో స్వాభావిక లక్షణమని, ఈ విషయంలో సడలింపు ఇస్తే తప్పుడు సందేశాన్ని పంపుతుందంటూ ఆర్మీ ఉద్యోగిని సుప్రీంకోర్టు మందలించింది. ఓ కేసులో నోటీసు లేకుండా అదనంగా సెలవులు తీసుకున్నందుకు ఆర్మీ సర్వీస్ నుంచి మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ను తొలగించడాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. బలగాల్లో పని చేస్తున్న వ్యక్తుల క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించేది లేదని జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ రాజేశ్ బిందాలతో ధర్మాసనం స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఉద్యోగి జనవరి 4, 1983 ఆర్మీ సర్వీస్ కార్ప్స్లో మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్గా చేరాడు. 1998లో సదరు వ్యక్తికి నవంబర్ 8 నుంచి డిసెంబర్ 16 వరకు 39 రోజుల పాటు సెలవులు ఇచ్చింది. ఆ తర్వాత కూడా సెలవులు పొడించాలని అభ్యర్థించగా.. ఇందుకు అధికారులు సైతం అంగీకరించారు. 17 డిసెంబర్ 1998 నుంచి సెలవులను 15 రోజు 1999 వరకు 30 రోజులు ముందస్తు వార్షిక సెలవులు ఆర్మీ మంజూరు చేసింది. సెలవులు పూర్తయిన తర్వాత మళ్లీ విధుల్లో చేరలేదు. తన భార్య ఆరోగ్య సమస్యలతో బాధపడుందని, ఆదుకోవాలని కోరాడు.
సెలవులు పూర్తయిన ఉద్యోగంలో చేరకపోవడంతో ఆర్మీ చట్టంలోని సెక్షన్ 106 కింద కోర్టు విచారణ జరిపింది. సెలవులను అదనంగా సెలవులు తీసుకొని.. ఆ తర్వాత కూడా విధుల్లో చేరకపోవడంతో కోర్టు దోషిగా నిర్ధారిస్తూ సర్వీస్ నుంచి అతని తొలగించింది. అధికారులు సెలవులు మంజూరు చేసినా.. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సెలవులు తీసుకోవడంతో పాటు విధుల్లో చేరేందుకు రిపోర్ట్ చేయకపోవడాన్ని సాయుధ దళాల ట్రిబ్యుల్ లక్నో ప్రాంతీయ బెంచ్ అతన్ని తొలగించింది.
సాయుధ దళాల్లో సభ్యుడిగా ఉన్న ఇలాంటి వ్యక్తి క్రమ శిక్షణా రాహిత్యాన్ని సహించలేం. 108 రోజుల పాటు సుదీర్ఘంగా సెలవులు తీసుకొని.. అతను చెబుతున్న క్షమాపణలను అంగీకరిస్తే.. అది సర్వీసులోని ఇతరులకు తప్పుడు సంకేతాలను పంపుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. క్రమశిక్షణ అనేది సాయుధ బలగాల స్వాభావిక లక్షణమని గుర్తంచుకోవాలని చెప్పింది.
అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను చూసుకోవాల్సి ఉన్నందున సదరు ఉద్యోగి విధులకు గైర్హాజరయ్యానని చెబుతుండగా.. ఇందుకు సంబంధించిన ఎలాంటి డాక్యుమెంట్లను మాత్రం సమర్పించలేదు. ఆర్మీ చట్టం కింద విధించిన శిక్ష కంటే.. ఈ శిక్ష కఠినంగా లేదని ధర్మాసనం పేర్కొంది. నేరం స్వభావం, తీవ్రతను బట్టి నేరానికి శిక్ష విధించే విషయంలో కోర్టు మార్షల్ విచక్షణను కలిగి ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం నొక్కి చెప్పింది. అందువల్ల తనకు విధించిన శిక్ష అసమంజసంగా ఉందని పిటిషనర్ చేసిన వాదనలను కోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు పిటిషన్ను కొట్టి వేస్తూ 2015లో సాయుధ దళాల ట్రిబ్యునల్, లక్నో ప్రాంతీయ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు సమర్థించింది.