Supreme Court | కర్ణాటకలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు గురువారం అంగీకరించింది. పిటిషనర్ తరఫున న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించగా.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్దివాలా ధర్మాసనం విచారణ కోసం జాబితా చేసేందుకు ఆమోదం తెలిపింది. కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ప్రభుత్వం ఇటీవల ముస్లింలకు కేటాయించిన నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేసింది.
దాంతో పాటు రాష్ట్ర రిజర్వేషన్ కోటాలో కీలక మార్పులు చేసింది. ఎస్సీలకు 17శాతం రిజర్వేషన్లు పెంచడంతో పాటు లింగాయత్-వొక్కలిగ వర్గాలకు రిజర్వేషన్లు పెంచింది. ప్రభుత్వం రిజర్వేషన్ కోటాను 50 శాతం నుంచి 56 శాతానికి పెంచింది. ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేసి.. వారిని ఆర్థికంగా వెనుకబడి వర్గాలకు అందించే పదిశాతం రిజర్వేషన్లో చేర్చింది. ముస్లింలకు కేటాయించిన రిజర్వేషన్ల స్థానంలో.. కొత్త వొక్కలిగ, లింగాయత్ కేటగిరిలు సృష్టించి.. రెండుశాతం చొప్పున రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించింది. షెడ్యూల్డ్ కులాల (ఎస్సీలు) రిజర్వేషన్లను 15 నుంచి 17 శాతానికి , షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీలు) 3 నుంచి 7శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.