న్యూఢిల్లీ: బుల్డోజర్ జస్టిస్‌కు వ్యతిరేకంగా ఇటీవల ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించి ఏమైనా నిర్మాణాలను కూల్చేస్తే, వాటిని పునరుద్ధరించాలని ఆదేశిస్తామని గుజరాత్ ప్రభుత్వ అధికారులను సుప్రీంకోర్టు శుక్రవారం హెచ్చరించింది. కోర్టు ధిక్కరణకు పాల్పడిన అధికారులను జైలుకు కూడా పంపిస్తామని చెప్పింది. సుప్రీంకోర్టు గత నెల 17న ఇచ్చిన ఆదేశాల్లో, దేశవ్యాప్తంగా ఎటువంటి నిర్మాణాల కూల్చివేతలు జరగరాదని పేర్కొంది.
కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారి ఆస్తులను సైతం ధ్వంసం చేయరాదని స్పష్టం చేసింది. ఏమైనా నిర్మాణాలను కూల్చివేయాలంటే ముందుగా తన అనుమతి పొందాలని తెలిపింది. అయితే, రోడ్లు, జలాశయాలు, నదీపరీవాహక ప్రాంతాలు, ఫుట్‌పాత్‌లు వంటి బహిరంగ ప్రదేశాల్లో అక్రమ నిర్మాణాలను కూల్చేయడానికి ఈ ఆదేశాలు వర్తించబోవని తెలిపింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ, గత నెలలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించలేదని చెప్పారు.