న్యూఢిల్లీ, నవంబర్ 5: యూపీలోని మదర్సాలకు సుప్రీం కోర్టు ఊరటనిచ్చింది. ఉత్తరప్రదేశ్ బోర్డు ఆఫ్ మదర్సా- 2004 ఎడ్యుకేషన్ చట్టాన్ని సమర్థించింది. బోర్డు లౌకిక న్యాయ సూత్రాలను ఉల్లంఘించిందంటూ దానిని రద్దు చేస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును మంగళవారం సుప్రీం కోర్టు పక్కన పెట్టింది. ఈ చట్టం లౌకిక వాద సూత్రాన్ని ఉల్లంఘించిందని హైకోర్టు తప్పుగా అభిప్రాయపడిందని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.
యూపీ మదర్సా విద్యా చట్టాన్ని తాము సమర్థిస్తున్నామని పేర్కొంది. కాగా, యూపీలో మదర్సాల విద్యా చట్టం చెల్లదని, అందువల్ల మదర్సా విద్యాసంస్థలను మూసివేసి దానిలోని విద్యార్థులను రాష్ట్రంలోని వేరే విద్యాసంస్థల్లోకి మార్చాలంటూ గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. సుప్రీం కోర్టు తాజా తీర్పుతో ఇటు విద్యార్థులు, అటు ఉపాధ్యాయులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.