Supreme Court : బాలిక ఛాతిపై చేతులు వేయడం, ఆమె పైజామాను తొలగించే ప్రయత్నం చేయడాన్ని అత్యాచార నేరంగా నిర్ధారించలేమని ఈ నెల 17న అలహాబాద్ హైకోర్టు (Allahabad High court) ఇచ్చిన తీర్పుపై బుధవారం సుప్రీంకోర్టు (Supreme Court) స్టే విధించింది. బాలిక ఛాతిని పట్టుకోవడం, ఆమె ప్యాంట్ నాడా లాగేయడం లాంటి వాటిని అత్యాచార నేరంగా పరిగణించలేమని, నిందితుడిపై అభియోగాలను నిరూపించడానికి ప్రాసిక్యూషన్ ఈ సన్నద్ధత దశను దాటి వెళ్లాలని సూచిస్తూ అలహాబాద్ హైకోర్టు ఈ నెల 17న వివాదాస్పద తీర్పు ఇచ్చింది.
అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ‘వియ్ ది వుమెన్ ఆఫ్ ఇండియా’ అనే సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏ మాత్రం సున్నితత్వం లేని తీర్పని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. తీర్పు రాసిన వ్యక్తి సున్నితత్వ లోపానికి ఇది నిదర్శనమని చెప్పడానికి తాము బాధపడుతున్నామని పేర్కొంది.
ఇది క్షణికావేశంలో చేసిన వ్యాఖ్య కూడా కాదని, తీర్పును రిజర్వ్ చేసిన 4 నెలల తరువాత వెలువరించారని, అందువల్ల ఆయన మనస్ఫూర్తిగానే ఆ వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నామని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. సాధారణంగా కేసు ఈ దశలో ఉన్నప్పుడు స్టే ఇవ్వడానికి సంకోచిస్తామని, కానీ తీర్పులోని 21, 24, 26 పేరాల్లోని పరిశీలనలు చట్టానికి తెలియనివని, అమానవీయ వైఖరిని ప్రదర్శిస్తున్నాయని పేర్కొంది. ఆయా పేరాల్లోని పరిశీలనలపై స్టే విధిస్తున్నామని స్పష్టంచేసింది. దీనిపై స్పందించాలని కేంద్ర ప్రభుత్వానికి, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది.
సుమారు నాలుగేళ్ల క్రితం అనగా 2021 నవంబర్‌లో ఉత్తరప్రదేశ్‌లోని కసగంజ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన 11 ఏళ్ల కుమార్తెతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా.. అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు బైక్‌పై వెళ్తూ మహిళను అటకాయించారు. బాలికను ఇంటి దగ్గర దింపుతామని తల్లిని నమ్మించి బైక్‌పై తీసుకెళ్లారు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత బాలికను ఓ కల్వర్టు కిందకు లాక్కుపోయి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. బాలిక ఛాతి మీద చేతలు వేశారు. నాడా లాగేసి ఆమె ప్యాంట్‌ను తొలగించేందుకు ప్రయత్నించారు. బాలిక భయపడి కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. దాంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.
విషయం తెలుసుకున్న బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులపై సెక్షన్ 376, పోక్సో చట్టంలోని సెక్షన్ 18 కింద కేసు పెట్టారు. ఈ కేసు విచారణ క్రమంగా అలహాబాద్ హైకోర్టు వరకు వెళ్లింది. ఈ ఏడాది మార్చి 17న కేసును విచారించిన అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా వివాదాస్పద తీర్పు ఇచ్చారు. బాలిక ఛాతిపై చేతులు వేయడం, దుస్తులు పట్టుకుని లాగడం లాంటి చర్యలు అత్యాచారం కిందకు రావని తీర్పు చెప్పారు.
ఈ తీర్పు వివాదాస్పదంగా మారింది. పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సైతం దీనిపై స్పందించారు. ఈ తీర్పులో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు. ఇలాంటి తీర్పులవల్ల సమాజంలోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ క్రమంలోనే అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై విచారణను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. అత్యాచారం కేసులో తీర్పు సందర్భంగా అలహాబాద్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు బాధకరమని వ్యాఖ్యానించింది.