న్యూఢిల్లీ/కోల్‌కతా, ఆగస్టు 18: పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్జీ కార్ దవాఖానలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ కేసుపై ఈ నెల 20న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనున్నది. ఈ కేసు దర్యాప్తును కలకత్తా హైకోర్టు ఇటీవల కోల్‌కతా పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ చేసింది. మరోవైపు, దేశవ్యాప్తంగా వైద్యులు, నర్సుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ర్టాల్లో శాంతి భద్రతలపై ప్రతి రెండు గంటలకోసారి నివేదిక పంపాలని ఆయా రాష్ర్టాల పోలీసు శాఖలను కేంద్ర హోంశాఖ ఆదేశించింది.
హత్యాచారానికి గురైన బాధిత ట్రైనీ డాక్టర్ గుర్తింపు వెల్లడి, వదంతుల వ్యాప్తి చేస్తున్నారన్న ఆరోపణలపై కోల్‌కతా పోలీసులు ఆదివారం బీజేపీ మాజీ ఎంపీ లాకెట్ ఛటర్జీ, ఇద్దరు డాక్టర్లు కునాల్ సర్కార్, సువర్ణ గోస్వామిలకు సమన్లు జారీచేశారు.
ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటన బెంగాల్లో అధికార టీఎంసీలో విబేధాలకు దారితీసింది.‘సీబీఐ పారదర్శకంగా వ్యవహరించాలి. బాధితురాలి ఆత్మహత్య కథను ఎవరు అల్లారో తెలియాలంటే మాజీ ప్రిన్సిపాల్, పోలీసు కమిషనరన్ను కస్టడీ విచారణ చేయాలి’ అని టీఎంసీ రాజ్యసభ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ ఎక్స్ పోస్టులో డిమాండ్ చేశారు. మూడు రోజుల తర్వాతనే పోలీసుల జాగిలాలను తీసుకొచ్చారని, ఇలాంటి వందల ప్రశ్నలు ఉన్నాయని అన్నారు. అయితే శేఖర్ రాయ్ డిమాండ్లను మరో నేత కునాల్ ఘోష్ వ్యతిరేకించారు. హత్యాచార ఘటన గురించి తెలిసినప్పటి నుంచి పోలీసు కమిషనర్ తగిన విధంగా స్పందించారని, అవసరమైనదంతా చేశారని అన్నారు.
హత్యాచార ఘటనపై రాష్ట్రంలో నిరసనలు హోరెత్తుతున్నాయి. ఫుట్‌బాల్‌లో బద్ధ విరోధులైన ఈస్ట్ బెంగాల్, మోహన్ బగాన్ జట్టు సభ్యులు ఆదివారం సాల్ట్‌లేక్ స్టేడియం వద్ద ఉమ్మడిగా నిరసన ప్రదర్శన చేపట్టారు. వైద్యులు, ఆరోగ్య సిబ్బందిపై దాడుల్ని అరికట్టేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని పద్మ పురస్కారాలు అందుకున్న 70మంది వైద్యులు ప్రధాని మోదీకి లేఖ రాశారు.
కోల్‌కతా హత్యాచార ఘటనలో పోలీసులు, సీఎం మమతా బెనర్జీ తీరుపై మృతురాలి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘కేసులో న్యాయం చేకూర్చేందుకు సీఎం మమత ఏమీ చేయలేరని అర్థమైంది. ఆ దిశగా ఆమె చేస్తున్నది ఏమీ లేదు. న్యాయం కావాలంటూనే.. నిరసనల్ని అణచివేస్తున్నారు’ అంటూ ట్రైనీ డాక్టర్ తండ్రి వాపోయారు. కేసును వెంటనే ముగించేందుకు, నిరసనలను అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు, వారం గడిచినా దర్యాప్తు వేగవంతం కాకపోవడాన్ని క్రికెటర్ హర్భజన్‌సింగ్ ప్రశ్నించారు. నేరస్థుడికి త్వరగా శిక్షపడితేనే బాధితురాలి ఆత్మ శాంతిస్తుందన్నారు. ఈ మేరకు మమతకు లేఖరాశారు.