Supreme Court | ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడంపై ఢిల్లీ సర్కారుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పత్రికల్లో వస్తున్న వార్తలను చూస్తే.. ఢిల్లీలో బాణాసంచా నిషేధం అమలు కాలేదని అనిపిస్తోందని పేర్కొంది. ఇందుకు సంబంధించి సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. బాణాసంచా నిషేధంపై ఢిల్లీ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. దీపావళి నుంచి ఢిల్లీ నగరంలో కాలుష్యం విపరీతంగా పెరిగింది. దాంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. శ్వాసకోశ సమస్యలు, కళ్లు ఎర్రబారడం, చికాకు తదితర సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం నగరంలోని చాలా ప్రాంతంలో గాలి నాణ్యత సూచి 400 మార్క్‌ని దాటింది. పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని డిసెంబర్ 2, 2016న ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును ఇచ్చింది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీలో గ్రాప్ పాలసీని అమలులోకి తీసుకువచ్చారు. చలికాలంలో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇందులో పలు నిబంధనలు ఉన్నాయి. ఇందులో బాణాసంచాపై నిషేధం సైతం ఉన్నది. వాయు కాలుష్యంపై ఢిల్లీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సోమవారం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బాణాసంచా నిషేధాన్ని ఎందుకు అమలు చేయడం లేదని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నిషేధం ఉంటే పటాకులు ఎలా పేల్చారు? వీలైనంత త్వరగా సమాధానం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం పెరిగిపోవడంతో మార్నింగ్ వాక్ చేయడం మానేస్తున్నట్లు సీజేఐ చంద్రచూడ్ గురువారం వ్యాఖ్యానించారు. శ్వాసకోశ వ్యాధులను నివారించడానికి ఇంట్లోనే ఉండటమే మంచిదని, ఉదయాన్నే బయటకు వెళ్లకుండా ఉండాలని డాక్టర్ సలహా ఇచ్చారన్న ఆయన.. వాయుకాలుష్యం పెరుగుతుండడంపై ఆందోళన వ్యక్తం చేశారు.