న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా(Pawan Khera) చిక్కుల్లో పడ్డారు. సుప్రీంకోర్టులో ఆయనకు ఊరట దక్కలేదు. తెలంగాణ హై కోర్టు ఇచ్చిన ట్రాన్సిట్ ముందస్తు బెయిల్‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ భార్య రినికి బుయాన్ శర్మకు పలు దేశాల పాస్‌పోర్టులు ఉన్నట్లు ఖేరా ఆరోపించారు. ఆ ఆరోపణలపై గౌహతిలో ఆయనపై కేసు దాఖలైంది. జస్టిస్ జేకే మహేశ్వరి , జస్టిల్ అతుల్ చంద్రూకర్లతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. తన భార్య హైదరాబాద్‌లో నివసిస్తుందని, దానికి కావాల్సిన ఆధార్‌ను సబ్మిట్ చేశానని, అందుకే తన బెయిల్ ఇవ్వాలని ఖేరా ఈ కేసులో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఏప్రిల్ 10వ తేదీన ఖేరాను తెలంగాణ హైకోర్టు వారం పాటు ట్రాన్సిట్ ముందస్తు బెయిల్‌ను మంజూరీ చేసింది. ఆ బెయిల్‌పై ఇవాళ సుప్రీం స్టే ఇచ్చింది. ఏప్రిల్ 5వ తేదీన ఓ ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో ఖేరా మాట్లాడుతూ.. అస్సాం సీఎం భార్య కు పలు దేశాల్లో పాస్‌పోర్టులు ఉన్నాయని, అయితే ఈ విషయాన్ని సీఎం బిశ్వశర్మ తన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నలేదని ఆరోపించారు. ఏప్రిల్ 9వ తేదీన అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికలను టార్గెట్ చేస్తూ ఖేరా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆయనపై కేసు ఫైల్ చేశారు.