Supreme Court : పోక్సో కేసు (POCSO Case) లో దోషిగా తేలిన వ్యక్తి విషయంలో సుప్రీంకోర్టు (Supreme Court) అరుదైన తీర్పు ఇచ్చింది. ఆ వ్యక్తి కేసులో దోషిగా నిర్ధారణ అయినప్పటికీ అతడికి తన తుది తీర్పులో ఏ శిక్షా విధించలేదు. దోషిగా తేలినా శిక్ష విధించకపోవడం ఏమిటి అనుకుంటున్నారా..? అందుకు ఆ కేసులోని ప్రత్యేక పరిస్థితే కారణం. ఆ ప్రత్యేక పరిస్థితి గురించి తెలియాలంటే కేసు పూర్వాపరాలు తెలుసుకోవాల్సిందే..
మైనర్ అయిన బాలికతో లైంగిక సంబంధం కొనసాగించినందుకు గతంలో పశ్చిమబెంగాల్‌కు చెందిన ఓ వ్యక్తిపై పోక్సో కేసు నమోదైంది. ఆ కేసు విచారణ జరిపిన ట్రయల్ కోర్టు నిందితుడిని దోషిగా తేల్చి 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది. ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ అతడు కలకత్తా హైకోర్టును ఆశ్రయించాడు. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు 2023 అక్టోబర్ 18న సంచలన తీర్పు వెలువరించింది.
బాలిక పిటిషనర్‌తో ఇష్టపూర్వకంగానే లైంగిక సంబంధాన్ని కొనసాగించినట్లు రుజువైనందున అతడిని నిర్దోషిగా ప్రకటిస్తున్నట్లు తెలిపింది. ఆ సందర్భంగా హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ‘కేవలం రెండు నిమిషాల లైంగిక ఆనందం కోసం చూసుకుంటే.. సమాజం దృష్టిలో బాలికలు పరాజితులుగా మిగిలిపోతారు. కిశోరప్రాయ బాలికలు తమ లైంగిక వాంఛలను నియంత్రించుకోవాలి’ అని సూచించింది.
ఈ తీర్పుపై అప్పట్లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దాంతో ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. అదే సమయంలో నిందితుడిని నిర్దోషిగా ప్రకటిస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. దాంతో హైకోర్టు తీర్పును 2024 ఆగస్టు 20న సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆ కేసులో నిందితుడికి ట్రయల్ కోర్టు విధించిన శిక్షను పునరుద్ధరిస్తున్నట్లు స్పష్టంచేసింది.
అయితే అదే సమయంలో బాధిత బాలిక మైనర్‌గా ఉన్నప్పుడు తనతో లైంగిక సంబంధం నెరిపిన వ్యక్తినే ఇప్పుడు పెళ్లి చేసుకొని ఒక బిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని సర్వోన్నత న్యాయస్థానం ప్రస్తావించింది. బాధితురాలు, దోషి ఇద్దరూ ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటైనందున పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీ వేసి, బాధితురాలితో చర్చించాలని సూచించింది. ఆ కమిటీ నివేదిక ఆధారంగా శిక్షపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపింది.
దాంతో కోర్టు విధించిన గడువులోగా నిపుణుల కమిటీ కేసుకు సంబంధించిన నివేదికను సీల్డ్ కవర్లో కోర్టుకుఅందించింది. ఆ నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ ఏడాది ఏప్రిల్ 3న బాధితురాలితో మాట్లాడింది. తాజాగా శుక్రవారం తుది తీర్పు వెలువరించింది. మైనర్ బాలికపట్ల సదరు వ్యక్తి వ్యవహరించిన తీరు నేరమే అయినప్పటికీ.. ఇద్దరూ ఇప్పుడు కలిసి కాపురం చేస్తున్నందున తనకున్న విచక్షణాధికారాలను వినియోగించి ఎలాంటి శిక్ష విధించకుండా వదిలేస్తున్నట్లు పేర్కొంది.
అంతేగాక బాధితురాలు పదో తరగతి పరీక్షలు రాసిన అనంతరం ఆమెకు ఉపాధి కల్పించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు బెంగాల్ ప్రభుత్వానికి సూచించింది. తన తుది తీర్పులో సుప్రీంకోర్టు ఏమన్నదంటే.. ‘ప్రస్తుతం ఆమె మేజర్. చట్టప్రకారం ఆ ఘటనను అందరం నేరంగానే చూస్తున్నప్పటికీ.. బాధితురాలు దానిని అలా చూడటం లేదు. ఆ నేరం వల్ల ఆమెపై మానసికంగా ఎలాంటి ప్రభావం పడలేదు. కానీ కొన్ని ఇబ్బందికర పరిణామాలను ఎదుర్కొంది.’ అని వ్యాఖ్యానించింది.
ఈ కేసులోని ప్రత్యేక పరిస్థితులు అంటే మరీ ముఖ్యంగా దోషితో ప్రస్తుత కుటుంబ జీవితంలో బాధితురాలికి ఏర్పడిన భావోద్వేగ బంధాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నామని, ఆమెకు పూర్తిగా న్యాయం చేయడానికి తమ విచక్షణాధికారాలను ఉపయోగిస్తున్నామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆ మేరకు దోషిగా నిర్ధారణ అయినప్పటికీ బాధితురాలి భర్తకు ఎలాంటి శిక్ష విధించకుండా వదిలేసింది. అయితే అతడిని నిర్దోషిగా మాత్రం ప్రకటించలేదు.