న్యూఢిల్లీ, ఆగస్టు 18: కేరళలోని త్రిసూర్‌లో 65 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు 12 గంటల సమయం పడుతుంటే రూ. 150 టోల్ ఫీజు ఎందుకు చెల్లించాలని భారత జాతీయ రహదారుల సంస్థ(ఎన్హెచ్ఏఐ)ను సుప్రీంకోర్టు సోమవారం నిలదీసింది. త్రిసూర్‌లోని పలియెక్కర టోల్ ప్లాజా వద్ద టోల్ వసూళ్లను నిలిపివేస్తూ కేరళ హైకోర్టు జారీచేసిన ఉత్తర్వును సవాలు చేస్తూ ఎన్హెచ్ఏఐ, ఆ జాతీయ రహదారి నిర్వహణ కంపెనీ గురువాయూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాఖలు చేసిన పిటిషన్లపై చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కే వినోద్ చంద్రన్, జస్టిస్ ఎన్వీ అంజారియాతో కూడిన ధర్మాసనం తన తీర్పును రిజర్వ్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. ఒక రోడ్డు చివరి నుండి మరో రోడ్డు చివరికి వెళ్లేందుకు 12 గంటలు పడితే వాహనదారుడు ఎందుకు రూ. 150 టోల్ చెల్లించాలి? ఒక గంటలో ఉండాల్సిన ప్రయాణం 11 గంటలకు పైగా పట్టడమేగాక టోల్ కూడా చెల్లించాలా? అని ధర్మాసనం ప్రశ్నించింది.
ట్రాఫిక్ జామ్ కారణంగా వారాంతంలో ఆ 65 కిలోమీటర్ల దూరం దాటడానికి 12 గంటలు పట్టిందని ధర్మాసనం దృష్టికి వచ్చింది. నేషనల్ హైవే 544కు చెందిన ఎడప్పల్లి-మన్నుత్తి మార్గంలో రోడ్లు దుస్థితి కారణంగా అక్కడ టోల్ ఫీజును సస్పెండ్ చేస్తూ కేరళ హైకోర్టు ఆదేశించింది. రోడ్డు పనులు జరుగుతున్న కారణంగా తీవ్రంగా ట్రాఫిక్ సమస్య తలెత్తినట్లు ఎన్హెచ్ఏఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, కంపెనీ తరఫున సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్ వాదించారు. రోడ్లు మరమ్మతుల కారణంగా అక్కడ ప్రమాదం జరగలేదని, ఒక పెద్ద గోతిలో లారీ బోల్తాపడడంతోనే ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని, అది యాక్ట్ ఆఫ్ గాడ్ కాదని జస్టిస్ చంద్రన్ స్పష్టం చేస్తూ తుషార్ మెహతా వాదనను తిప్పికొట్టారు. టోల్ వసూళ్లను నాలుగు వారాల పాటు నిలిపివేయాలంటూ ఆగస్టు 6న హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఉత్తర్వులలో జోక్యం చేసుకోవడానికి ఆగస్టు 14న నిరాకరించిన సుప్రీంకోర్టు తన తీర్పును సోమవారం రిజర్వ్ చేసింది.