న్యూఢిలీ : తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బీజేపీ పాలిత ఒడిశాలోని బాలాసోర్‌లో బీఈడీ విద్యార్థిని ఒకరు ఆత్మాహుతి చేసుకుని మరణించడం మనకు సిగ్గుచేటని సుప్రీం కోర్టు మంగళవారం వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాల బాలికలు, గృహిణులు, పిల్లల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో సూచనలు ఇవ్వాలని సుప్రీంకోర్టు కోరింది. బాలాసోర్ ఉదంతాన్ని సుప్రీంకోర్టు మహిళా న్యాయవాదుల సంఘం ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకురావడంతో స్పందించిన జస్టిస్‌లు సూర్యకాంత్, జాయ్మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
అలాగే దేశంలోని మహిళలు, పిల్లలు, లింగమార్పిడి చేసుకున్న వ్యక్తులు సురక్షితంగా జీవించేలా దేశవ్యాప్తంగా తగిన మార్గదర్శకాలు జారీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారించింది. ‘దురదృష్టవశాత్తు మన సమాజంలో ఇంకా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి మేము సిగ్గుపడుతున్నాం. దీనిపై కేంద్రం, అన్ని పార్టీల వారు తగిన సూచనలివ్వాలని కోరుతున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది. ‘పాఠశాల బాలికలు, గృహిణులు, గ్రామీణ ప్రాంతాల పిల్లల భద్రతను పెంచడానికి ఎలాంటి పటిష్ఠ చర్యలు తీసుకోవాలో అన్ని వర్గాల వారి నుంచి సూచనలు కోరుతున్నాం’ అని తెలిపింది. కాగా, బాలాసోర్‌లోని బీఈడీ కళాశాలలో చదువుతున్న 20 ఏండ్ల విద్యార్థినిని కోరిక తీర్చాలంటూ ఆమె హెచ్‌వోడీ లెక్చరర్ వేధించాడు. దీనిపై ఆమె కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. దీంతో దీనికి నిరసనగా విద్యార్థులు నిర్వహించిన ఆందోళన సందర్భంగా బాధిత విద్యార్థిని పెట్రోల్ పోసుకుని ఒంటికి నిప్పంటించుకుని ఆత్మాహుతి యత్నం చేసి, చికిత్స పొందుతూ మరణించింది.
బీజేపీ పాలిత ఒడిశాలో బీఈడీ విద్యార్థిని ఆత్మాహుతి ఘటన మరువక ముందే మరో దారుణం చోటుచేసుకుంది. ఒక మైనర్ బాలికను అపహరించిన ముగ్గురు వ్యక్తులు ఆమెపై సామూహిక లైంగిక దాడి చేశారు. వారి నుంచి తప్పించుకుని వచ్చిన ఆ బాలికను ఒక ట్రక్ డ్రైవర్ రేప్ చేశాడు. వివరాల్లోకి వెళితే.. ఆదివారం మల్కాన్‌గిరి జిల్లాలో తన స్నేహితురాలి పుట్టిన రోజు వేడుకకు వెళ్లి తిరిగి వస్తున్న ఒక బాలికను ముగ్గురు వ్యక్తులు అడ్డగించి మల్కాన్‌గిరి పట్టణానికి 10-15 కి.మీ దూరంలోని అడవిలోకి తీసుకుని వెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. తర్వాత వారి నుంచి తప్పించుకుని వస్తున్న ఆమెపై మల్కాన్‌గిరి శివారులో ఒక ట్రక్కు డ్రైవర్ అడ్డగించి లైంగిక దాడి చేశాడు.
ముంబై : బీజేపీ పాలిత మహారాష్ట్రలో సీనియర్ విద్యాశాఖాధికారులు వేలాది బోగస్ టీచర్ల ఐడీలను సృష్టించి రూ.2-3 వేల కోట్ల ప్రజా ధనాన్ని స్వాహా చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, హెచ్ఆర్ పోర్టల్ అయిన శలరత్లో నకిలీ టీచర్ల ఐడీలను నమోదు చేసి వారి పేరిట జీతాలను డ్రా చేశారు. ముంబై, నాగ్‌పూర్ జోన్లలో జరిగిన ఈ స్కామ్‌పై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. శలరత్ పోర్టల్‌లో ప్రభుత్వ, ఎయిడెడ్ టీచర్లు, ఇతర విద్యా శాఖ సిబ్బంది ప్రతి ఒక్కరికి ఒక శలరత్ ఐడీని జారీ చేస్తారు.
ప్రభుత్వ స్కూళ్లలో టీచర్ల నియామకం కట్టుదిట్టంగా ఉంటుంది. కానీ ఎయిడెడ్ స్కూళ్లలో వాళ్ల స్క్రూటీని పరిమితంగా ఉండటంతో.. ఈ లోపాన్ని ఉపయోగించుకొని అర్హత లేని వ్యక్తులను నకిలీ ఉద్యోగాల్లో నియమించుకొని వారికి శలరత్ ఐడీ కేటాయించారు. నకిలీ డాక్యుమెంట్లు, ఫొటోల సాయంతో బ్యాంక్ ఖాతాలు తెరచి, వారి పేరిట జీతాలను డ్రా చేశారు. ఇలా అనర్హులైన వ్యక్తులకు శలరత్ ఐడీ జారీ చేసినందుకు గాను స్కూల్ మేనేజ్మెంట్, ప్రభుత్వ సిబ్బందికి రూ.20-30 లక్షల లంచం ముట్టినట్టు ఉన్నతాధికారులు ఆరోపిస్తున్నారు.