న్యూఢిల్లీ, ఏప్రిల్ 3 : పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోని, రాష్ట్ర ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లోని 25,753 మంది టీచర్లు, ఇతర సిబ్బంది నియామకాలను సుప్రీంకోర్టు గురువారం రద్దు చేసింది. యావత్ నియామక ప్రక్రియ లోపభూయిష్టం, కళంకితమైనదిగా సుప్రీంకోర్టు అభివర్ణించింది. 2024 ఏప్రిల్ 22న కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది. నియామకాలను రద్దు చేసిన ధర్మాసనం కొత్త నియామక ప్రక్రియను చేపట్టి మూడు నెలల్లో పూర్తి చేయాలని పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
న్యాయవ్యవస్థ పట్ల తనకు అపారమైన గౌరవం ఉందని, కాని టీచర్ల నియామకాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తనకు ఆమోదయోగ్యం కాదని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. సుప్రీం తీర్పుకు కట్టుబడి ఉంటూనే అన్ని న్యాయపరమైన అవకాశాలను తాము పరిశీలిస్తామని విలేకరుల సమావేశంలో మమత వెల్లడించారు.
సుప్రీంకోర్టు రద్దు చేయడంతో ఉద్యోగాలు కోల్పోయిన 25 వేల మందికిపైగా టీచర్ల దుస్థితికి బాధ్యురాలైన సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. టీచర్ల నియామకంలో జరిగిన భారీ అవినీతికి ముఖ్యమంత్రి వైఫల్యమే కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ ఆరోపించారు.