Supreme Court : ఈ ఏడాది జూలై 1 నుంచి 9వ తరగతి విద్యార్థులు తప్పనిసరిగా మూడు భాషలు అభ్యసించాలని సీబీఎస్ఈ (CBSE) ఇటీవల నిర్ణయం తీసుకుంది. దీన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ క్రమంలోనే సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ (Justice Suryakant), జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ (Justice Joy Malya Bagchi), జస్టిస్ విపుల్ ఎం పంచోలీ (Justice Vipul M Pancholi) లతో కూడిన ధర్మాసనం.. కేంద్రం, సీబీఎస్ఈ, ఎన్సీఈఆర్టీలకు ఈ అంశంపై నోటీసులు జారీచేసింది. రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆ నోటీసులలో ఆదేశించింది.
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గి, కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ఈ వ్యవహారం రాజ్యాంగపరమైన అంశాలతో ముడిపడి ఉందని సిబల్ అన్నారు. భాష అనేది ఛాయిస్‌కు సంబంధించిన విషయమని, దానిని బలవంతంగా రుద్దలేమని తెలిపారు. ఈ వ్యవహారంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు నిరాకరించిన సర్వోన్నత న్యాయస్థానం.. తదుపరి విచారణను జూలై రెండో వారానికి వాయిదా వేసింది. త్రిభాషా విధానాన్ని అమలు చేయడానికి సీబీఎస్ఈ లాజిస్టికల్ సంసిద్ధతపై నివేదిక సమర్పించాలని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్యా భాటీని ఆదేశించింది.