Supreme Court | దేశంలో పులుల మరణాలకు సంబంధించిన వివరాలను తన ముందుంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. పలుల మరణాలపై వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తులు జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం కేంద్రాన్ని సమాచారం కోరింది. దేశవ్యాప్తంగా అంతరించిపోతున్న పులులను రక్షించాలని కోరుతూ 2017లో న్యాయవాది అనుపమ్ త్రిపాఠి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ‘పిటిషనర్ హాజరు కానప్పటికీ భారతదేశంలో పులుల మరణాలపై ప్రతివాదులు నిర్ధారిస్తారు. మూడు వారాల తర్వాత విషయాన్ని జాబితా చేయండి’ అని బెంచ్ పేర్కొంది. ఇదిలా ఉండగా.. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA) ప్రకారం.. 2012 నుంచి భారత్ 1,059 పులులను కోల్పోయింది.
‘టైగర్ స్టేట్’గా పిలుచుకునే మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 270 పులుల మరణాలు నమోదయ్యాయి. 2018 నివేదిక ప్రకారం.. దేశంలో 53 పులుల సంరక్షణ కేంద్రాల్లో 2,967 పులులు ఉన్నాయని జనవరి 27న కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి కేంద్రం తరఫున వాదనలు వినిపించారు. పులుల సంరక్షణ, వాటి సంఖ్యను పెంచేందుకు కృషి చేశామన్నారు. టైగర్ రిజర్వ్ సమీపంలో సమీపంలో నివసించే ప్రజలను తరలించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై 2017లో సుప్రీంకోర్టు పర్యావరణ మంత్రిత్వ శాఖ, నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్‌లైఫ్, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీకి నోటీసులు జారీ చేసింది. విషప్రయోగం చేయడం, ఫారెస్ట్ గార్డుల కాల్పులు, వేటగాళ్ల ఉచ్చుకు పులులు బలవుతున్నట్లుగా పిటిషన్లో పేర్కొన్నారు.