న్యూఢిల్లీ: ఢిల్లీలో వీధి కుక్కల కేసులో ఆగస్టు 11వ తేదీన ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటీషన్లు దాఖలయ్యాయి. ఆ పిటీషన్లపై ఇవాళ సుప్రీం ధర్మాసనం స్పందిస్తూ తీర్పును రిజర్వ్ చేసింది. ఢిల్లీలో వీధి కుక్కలు కనిపించకుండా చేయాలని, వాటిని షెల్టర్హౌజ్లకు తరలించాలని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పును ఖండిస్తూ పలు పిటీషన్లు దాఖలు అయ్యాయి. గత ఆదేశాలపై ఇవాళ ధర్మాసనం స్టే ఇవ్వలేదు. కానీ తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు చెప్పింది. జస్టిస్ విక్రమ్ నాథ్, సందీప్ మెహతా, ఎన్వీ అంజారియాలతో కూడిన ధర్మాసనం గత తీర్పుపై స్టే ఇవ్వలేదు.
కేంద్ర ప్రభుత్వం తరపున ఇవాళ సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. ప్రజాస్వామ్యంలో కొందరు తమ స్వరాన్ని వినిపిస్తారని, కొందరు మౌనంగా వేదన అనుభవిస్తారని, కొందరు మటన్, చికెన్ తింటూ.. యానిమల్ లవర్స్ అని చెప్పుకుంటారని, ఈ సమస్యను పరిష్కరించాలని, కుక్క కాటుతో చిన్నారులు చనిపోతున్నారని, స్టెరిలైజేషన్తో రేబిస్‌ను ఆపలేకపోతున్నారని, వ్యాక్సిన్లు ఇచ్చినా ఇది సాధ్యం కావడం లేదని ప్రభుత్వం కోర్టులో వాదించింది. డబ్ల్యూహెచ్‌వో నివేదిక ప్రకారం ప్రతి ఏడాది 305 మంది కుక్క కాటుకు బలి అవుతున్నారని, దీంట్లో ఎక్కువ మంది 15 ఏళ్ల లోపువారే ఉన్నట్లు చెప్పారు. జంతువులను ఎవరూ ద్వేషించరని, కుక్కలను చంపాల్సిన అవసరం లేదని, కానీ వాటిని వేరు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని, పేరెంట్స్ తమ పిల్లల్ని బయటకు పంపలేకపోతున్నారని సొలిసిటర్ జనరల్ తెలిపారు.
ప్రాజెక్ట్ కైండ్‌నెస్ ఎన్జీవో తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. ఆగస్టు 11వ తేదీన ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కోరారు. వీధి కుక్కల కోసం మున్సిపల్ కార్పొరేషన్ ఏమైనా షెల్టర్ హోమ్‌లు నిర్మించిందా అని ప్రశ్నించారు. కుక్కలను స్టెరిలైజ్ చేస్తున్నారా అని అడిగారు. నిధులను మళ్లించారు, కానీ షెల్టర్ హోమ్‌లను కట్టలేదన్నారు. కుక్కలను మాత్రం రౌండప్ చేసి తీసుకెళ్లుతున్నట్లు చెప్పారు.